×
Ad

Sheikh Hasinas Awami League: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా..

ఆమెకు అన్ని దారులు మూసేసి భారత్ పై ఒత్తిడి పెంచేందుకే యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

Sheikh Hasinas Awami League: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత వ్యతిరేక స్టాండ్ తీసుకున్న తాత్కాలిక ప్రభుత్వం మరిన్ని కుట్రలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పై నిషేధం విధించింది యూనస్ సర్కార్. ఇప్పటికే షేక్ హసీనాపై అవినీతి కేసులు పెట్టి వాటిలో మరణ శిక్ష కూడా విధించేలా చేసింది ప్రభుత్వం. ఆమెకు అన్ని దారులు మూసుకుపోయేలా చేస్తోంది.

సాధారణ ఎన్నికలు కనుక జరిగితే అవామీ లీగ్ ఘన విజయం సాధిస్తుందని, అదే జరిగితే షేక్ హసీనాపై కేసులన్నీ వీగిపోతాయి. ఇదే విషయాన్ని రీసెంట్ గా షేక్ హసీనా కూడా చెప్పారు. కానీ, ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటానికే అవామీ లీగ్ పై ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ విధించినట్లుగా అర్థమవుతోంది. అలా ఆమెకు అన్ని దారులు మూసేసి భారత్ పై ఒత్తిడి పెంచేందుకే యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తన కార్యకలాపాలపై నిషేధం కారణంగా ఫిబ్రవరి 2026లో జరగబోయే జాతీయ పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ధృవీకరించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫికుల్ ఆలం దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఎదుర్కొంటున్న అవామీ లీగ్ రాబోయే జాతీయ ఎన్నికల్లో పాల్గొనలేదని ప్రకటించారు. అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం, ఎన్నికల సంఘం ఆ పార్టీని రద్దు చేయడం.. ఈ కారణంగా అవామీ లీగ్ వచ్చే ఎన్నికల్లో పాల్గొనలేదని తేల్చి చెప్పారు.

అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఆ పార్టీ నాయకులు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. మే నెలలో తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ అవామీ లీగ్.. దాని అనుబంధ, సంబంధిత సంస్థల కార్యకలాపాలన్నింటినీ నిషేధిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో విచారణలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఆలం తెలిపారు. ఇంతలోనే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ప్రజా భద్రతా విభాగం ఈ గెజిట్‌ను జారీ చేసింది. ఉగ్రవాద నిరోధక ఆర్డినెన్స్ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది.

Also Read: బంగ్లాదేశ్ డార్క్ ప్రిన్స్ తారిక్ రహమాన్ తిరిగి వచ్చేశారు.. ఇది భారత్‌కు ఎందుకు శుభవార్త?