బంగ్లాదేశ్ డార్క్ ప్రిన్స్ తారిక్ రహమాన్ తిరిగి వచ్చేశారు.. ఇది భారత్‌కు ఎందుకు శుభవార్త?
తారిక్ రహమాన్ తిరిగిరావడంతో బీఎన్‌పీ కార్యకర్తల్లో ఇది ఉత్సాహం నింపి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భారత్ ఆశిస్తోంది.
Tarique Rahman
Tarique Rahman: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు, ఆ దేశ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా గుర్తింపు పొందిన తారిక్ రహమాన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఇవాళ ఢాకాకు తిరిగొచ్చారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరిగే ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
రహమాన్ ఇన్నాళ్లు బంగ్లాదేశ్‌లో లేనప్పటికీ ఆ దేశం అంతటా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) పోస్టర్లపై ఆయన ఫొటోలు కనపడ్డాయి. ర్యాలీల్లో ఆయన ఆడియో సందేశాలు వినిపించాయి. ఆందోళనలు, హింసతో కుదేలైన బంగ్లాదేశ్‌కు, బీఎన్‌పీకి తారిక్ రహమాన్ తిరిగి రావడం కీలక ఘట్టం. ఇది భారత్ ప్రాంతీయ భద్రతకు కూడా కీలకం.
బీఎన్‌పీ చైర్మన్‌గా ఉన్న తారిక్ రహమాన్ తన భార్య డాక్టర్ జుబైదా రహమాన్, కుమార్తె జైమాతో కలిసి ఢాకాకు వచ్చారు. “6,314 రోజుల తరువాత బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాను” అని ఢాకా చేరుకున్న వెంటనే రహమాన్ పోస్ట్ చేశారు. భారత్ దృష్టిలో ఆయన రాకకు అత్యంత ప్రాధాన్యం ఉంది.
Also Read: 2026లో బంగారంపై పెట్టుబడి పెడితే మీపై డబ్బుల వర్షం కురుస్తుందా? లేదంటే వెండిపైనా..?
హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న బంగ్లాదేశ్‌లో భారత్ అనుకూల అవామీ లీగ్ ఎన్నికల బరిలో నిలవలేకపోతోంది. ఖలేదా జియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రధానిగా మహమ్మద్ యూనస్ కొనసాగుతున్న వేళ తీవ్రవాద ఇస్లామిస్టులు రెచ్చిపోతూ భారత్‌పై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు జమాత్ ఏ ఇస్లామీ ఆందోళన కలిగిస్తోంది.
ఈ సంస్థ పాకిస్థాన్ ఐఎస్ఐకు అనుబంధంగా పనిచేస్తోందని అంచనాలు ఉన్నాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం నిషేధించిన జమాత్, గత ఏడాది ఆమె పదవి నుంచి తప్పుకున్న తరువాత మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించింది.
ఇటీవల జరిపిన సర్వే ప్రకారం.. ఎన్నికల్లో బీఎన్‌పీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశమున్నప్పటికీ, జమాత్ ఇప్పుడు బీఎన్‌పీకి గట్టి పోటీ ఇస్తోంది. ఢాకా విశ్వవిద్యాలయ ఎన్నికల్లో జమాత్ విద్యార్థి విభాగం అనూహ్య విజయం సాధించడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయం.
తారిక్ తిరిగి రావడం భారత్‌కు ఎందుకు శుభవార్త?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీఎన్‌పీని భారత్ ఉదారవాద, ప్రజాస్వామ్య పార్టీగా చూస్తోంది. తారిక్ రహమాన్ తిరిగిరావడంతో బీఎన్‌పీ కార్యకర్తల్లో ఇది ఉత్సాహం నింపి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భారత్ ఆశిస్తోంది.
అంతేకాదు, ఎన్నికల్లో మరో శక్తిగా ఉన్న విద్యార్థి నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ నేతలు ఇటీవల మాట్లాడుతూ.. భారత్ అనుకూల అవామీ లీగ్ పార్టీ సభ్యులను బీఎన్‌పీ తమ పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించింది.
హసీనా పాలనలో భారత్‌తో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలు పెంచుకుంది. చైనా విషయంలో సమతుల్యంగా వ్యవహరించింది. పాకిస్థాన్‌కు దూరంగా ఉంది. యూనస్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారింది. భారత్‌కు దూరంగా ఉంటూ, పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
బీఎన్‌పీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది. ఇటీవల భారత్, బీఎన్‌పీ సంబంధాలు పునఃపరిశీలన దిశగా సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖలేదా జియా ఆరోగ్యంపై డిసెంబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ మద్దతు ప్రకటించారు. బీఎన్‌పీ దీనికి కృతజ్ఞతలు తెలిపింది. ఇది రాజకీయ సానుకూల సంకేతం.
యూనస్ మధ్యంతర ప్రభుత్వంతో రహమాన్ భేదాభిప్రాయాలు కలిగి ఉండటం, దీర్ఘకాలిక విదేశాంగ నిర్ణయాలు తీసుకునే హక్కుపై మధ్యంతర ప్రధానిని ప్రశ్నించడం భారత్‌కు అనుకూలంగా మారింది. జమాత్‌పై విమర్శలు గుప్పించి, ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోనని రహమాన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఆరంభంలో రహమాన్ ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ విదేశాంగ విధానాన్ని ప్రకటించారు. ఇది డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని పోలి ఉంది.
రహమాన్‌కి ఘనస్వాగతం
ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా తన గురించి తాను చెప్పుకుంటున్న తారిక్ రహమాన్‌కు ఢాకా విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన నివాసం వరకు జరిగిన రోడ్‌షోలో సుమారు 50 లక్షల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రహమాన్ బొగురా-6 సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. బీఎన్‌పీ అధ్యక్షురాలు జియా మరోసారి తన కంచుకోట బొగురా-7 గబ్తలి-షాజాహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
రోడ్‌షోలో జరిగిన బల ప్రదర్శనపై తీవ్రవాద శక్తులు అసంతృప్తిగా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల ముందు బీఎన్‌పీ, జమాత్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేము.
