US Presidential Polls-2024
Russia-Ukraine War: నెలలుగా కొనసాగుతున్న ఉక్రయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు అమెరికా ఒక హెచ్చరిక చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాల జోలికి మాత్రం వెళ్లొద్దని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, తమ తప్పిదాల్ని దాచేందుకు పుతిన్ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అమెరికా పేర్కొంది.
ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్తు కర్మాగారంలో రష్యా బలగాలు రహస్యంగా పని చేస్తున్నాయని, ఆ కసరత్తు అంతా ‘డర్టీ బాంబు’ను ప్రయోగించడానికేనని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తే అది ‘తీవ్ర తప్పిదమే’ అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అయితే డర్టీ బాంబ్ విషయమై మరింత స్పష్టత కావాలని వైట్ హౌస్ సెక్రెటరీ కరైన్ జీన్ పెర్రీ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించడం తీవ్ర తప్పిదమే కాకుండా.. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్న ఆమె.. సాకుగా చూపడానికే పుతిన్ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. ఏదేమైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు రష్యా సిద్ధమవుతుందని అనుకోవడం లేదని.. అయినప్పటికీ పరిస్థితులను అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జీన్-పెర్రీ పేర్కొన్నారు.
ఇక ఇదే విషయమై రష్యాకు భారత్ కీలక సూచన చేసింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధంలో అణ్వాయుధాల ఉపయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య ఎలాంటిదైనా దౌత్యమార్గాల ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రష్యాకు రాజ్నాథ్ సూచించారు. ఇదే భారత వైఖరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
అణు, రేడియోలాజికల్ ఆయుధాల వినియోగం మానవత్వపు ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధమైందని అన్న రాజ్నాథ్.. వాటిని ఎంతమాత్రం ఆశ్రయించవద్దని సెర్గీ షోయిగుకి సూచించారు. భారత్, రష్యా మధ్య సైనిక సహకారంతో పాటు ఉక్రెయిన్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపైనా ఇరు దేశాల మంత్రులు చర్చించారని సమాచారం.