హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఉద్రికతలు నెలకొన్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను విడగొట్టాలని చూసేవారి శరీరాలు బూడిదైపోతాయని,ఎముకలు పిండి పిండి అవుతాయని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా నుంచి ఏ ప్రాంతాన్నైనా విడగొట్టాలని చూసినవాళ్లు చచ్చిపోవడం కాయమని,వాళ్ల ఎముకలు విరిగిపోతాయని,శరీరాలు బూడిదైపోతాయని జిన్ పింగ్ వ్యాఖ్యానించినట్లు ఆ ప్రకటనలో ఉంది.
చైనా విభజనకు మద్దతు ఇచ్చే ఏదైనా బాహ్య శక్తులను చైనా ప్రజలు భ్రమగా భావిస్తారని ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్న జిన్ పింగ్ అన్నారు. అయితే జిన్ పింగ్ ఏ ప్రాంతాన్ని పేరుతో ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన వ్యాఖ్యలపై మరోసారి హాంకాంగ్ లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. నిరసనకారులు రోడ్లను బ్లాక్ చేశారు, రైలు పట్టాలను ధ్వంసం చేశారు. చైనా అనుకూల దుకాణాలపై దాడులు చేశారు. పలు చోట్ల ర్యాలీలకు దిగారు. హాంకాంగ్ లో అశాంతికి బయటిశక్తులు మద్దతిస్తున్నాయని చైనా ఆరోపిస్తోంది.
అయితే హాంకాంగ్ లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ లోని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా హాంకాంగ్ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతోంది. ఇటువంటి సమయంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంచున్నాయి. ప్రపంచదేశాలను హాంకాంగ్ జోలికి రాకుండా బెదిరించే ప్రయత్నంగా జిన్ పింగ్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవచ్చు.