Kabul
Body of Dead : తాలిబన్ల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతూ ప్రాణాలు కోల్పోయిన అఫ్ఘాన్ల విషయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాబూల్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం అమెరికాలో ల్యాండ్ అయ్యాక మరో దారుణం బయటపడింది. విమానం ల్యాండింగ్ గేర్‌లో ఓ అఫ్ఘానిస్తాన్ వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. విమానం గాల్లోకి ఎగిరాక ల్యాండింగ్ గేర్ పైకి పోలేదని, కారణం ఏమయ్యుంటుందని పరిశీలించగా.. వీల్ వెల్‌లో మృతదేహం ఉన్నట్టు తెలిసిందన్నారు. ఈ విమానం వెంట పరిగెత్తి విమానం రెక్కలను, చక్రాలను పట్టుకుని వెళ్లేందుకు అనేక మంది ప్రయత్నించారు. కొంతమంది మాత్రం విమానం ఎగిరేవరకు అలా వేలాడారు. అయితే విమానం ఆకాశంలోకి వెళ్లాక పట్టు కోల్పోయి కింద పడి మరణించారు.
Read More : Kerala Man : కోవాగ్జిన్ 2 డోసులు తర్వాత కోవిషీల్డ్ కావాలంటూ కోర్టుకెక్కాడు!
తాలిబన్లు కాబూల్‌ని ఆక్రమించిన వెంటనే అఫ్ఘానిస్తాన్ పౌరులు.. ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు తీశారు. ఏ విమానం ఉంటే ఆ విమానం ఎక్కి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. బస్సుల్లో ఫుట్ బోర్డింగ్ చేసినట్టుగా అమెరికా యుద్ధ విమానాన్ని పట్టుకు వేలాడారు. విమానం రెక్కలపై వేలాడుతూ తమ ప్రాణాలను గాల్లో దీపాలుగా చేసుకున్నారు. చివరికి ఆ వాయు వేగానికి నిలువలేక పై నుంచి పడి ఇద్దరు మరణించారు. ఇప్పుడు మరో వ్యక్తి ల్యాండింగ్ గేర్‌లో మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. విమానం రెక్కలపై ప్రయాణిస్తూ ఓ వ్యక్తి తీసిన వీడియో.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read More : AP : వైఎస్ వివేకా హత్య కేసు, సునీల్‌కు నార్కో పరీక్షలు..కోర్టు అనుమతినిస్తుందా
సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది వచ్చి ఆక్రమించారని అమెరికా ప్రకటించింది. గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం సరుకును దించకముందే.. ఆ విమానాన్ని వందలాది మంది చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు తేలడంతో.. తక్షణమే సీ-17 విమానాన్ని అక్కడ నుంచి తరలించినట్లు చెప్పారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం చెప్పింది.