నదిలో పడిన విమానం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • Publish Date - May 4, 2019 / 05:50 AM IST

అమెరికాలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్‌ 737 విమానం రన్‌వే నుంచి జారి నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 143మంది ఉన్నారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని జాక్స‌న్‌విలేలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా.. అదుపు తప్పడంతో మియామి ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737.. రన్‌వేకి సమీపంలో ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలోకి వెళ్లినపోయింది.

ఈ ఘటనలో 21మందికి గాయాలవగా.. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే గాయాలు అయిన వారికి కూడా పెద్ద ప్రమాదం అయితే ఏమీలేదని అధికారులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విమానం క్యూబా నుంచి వస్తుండగా అందులో 136మంది  ప్రయాణికులు ఉన్నారు. విమానం ఇంధ‌నం న‌దిలో క‌ల‌వకుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే ప్రమాదం పెద్దది కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.