సృష్టికర్త ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందా..?

గణితంతో దేవుడు దొరుకుతాడు అంటే నమ్ముతారా ! నమ్మి తీరాలి అంటున్నాడో సైంటిస్ట్‌.

ఇందుగలడు అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అంతటా గలడు అంటాడు ప్రహ్లాదుడు. అంటే ప్రతీ అణువులో, ప్రతీ విషయంలో దేవుడు ఉన్నాడని ! చివరికి గణితంలోనూ దేవుడు ఉన్నాడు.. గణితంతో దేవుడు దొరుకుతాడు అంటే నమ్ముతారా ! నమ్మి తీరాలి అంటున్నాడో సైంటిస్ట్‌. ఆ ఒక్క సూత్రం దేవుడి ఉనికి చెప్తుందంటున్నాడు.

దేవుడున్నాడా లేడా.. సమాధానం దొరకని.. చర్చ ఆగని ప్రశ్న ఇదే ! వేలాది ఏళ్ల నుంచి మనిషి పరిణామం చెందుతున్నాడు. దేవుడు అనే మాట చుట్టూ.. వాదన చుట్టూ మనిషి పరిణామ క్రమంలో ఎన్నో సంఘటనలుజరిగాయ్‌. మానవాళికి సంబంధించిన ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయ్‌. దేవుడు అంటే నమ్మకం అనే వాళ్లు కొందరు.. ఆశ అనే వాళ్లు ఇంకొందరు.. మూఢ నమ్మకం అనే వాళ్లు మరికొందరు.. ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మానవాళిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఆస్తికులు.. నాస్తికుల మధ్య వాదనలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయ్‌. దేవుడు ఉన్నాడని ఆస్తికులు.. ఉంటే చూపించు అని నాస్తికులు.. మాటలతో యుద్ధాలు చేయడం కూడా చూస్తునే ఉంటాం. అలాంటి చర్చకు ఇక ఫుల్‌స్టాప్ పడబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఓ సైంటిస్టు మాటలతో దేవుడిని చూపించొచ్చా.. దైవం ఉనికిని ప్రదర్శించొచ్చా అనే చర్చ మొదలైంది.

ఆస‌క్తిక‌ర వాద‌నను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత‌..

హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదన తెరమీదకు తీసుకొచ్చారు. దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ అంటున్నారు. జీవం పుట్టుకకు కచ్ఛితమైన.. నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే.. అవేవో యాక్సిడెంటల్‌గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట. జీవం మనుగడ సాగించటానికి వీలుగా విశ్వాన్ని రచించినట్లుగా ఆయన చెప్తున్నారు. ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రస్తావిస్తూ.. మహా విస్పోటనం జరిగినప్పుడు పదార్థం.. వ్యతిరేక పదార్థం రెండు పుట్టుకొచ్చాయని.. పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు కారణమైందని సూన్‌ చెప్తున్నారు. రెండు పదార్థాలు సమానంగా ఉంటే.. ఒకదానికి ఒకటి రద్దు చేసుకునేవని.. అప్పుడు జీరో అయ్యేదన్నది సూన్ వాదన

ప్రపంచాన్ని దేవుడే నడిపిస్తున్నాడా.. లేదా..

ప్రపంచాన్ని దేవుడే నడిపిస్తున్నాడా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఏదో శక్తి మాత్రం కచ్చితంగా ఈ ప్రపంచం వెనక ఉంది అన్నది చాలామంది అభిప్రాయం. ఐతే సూన్ కూడా ఇప్పుడు అలాంటి చర్చే తీసుకువచ్చారు. మతానికి సైన్స్‌ విరుద్ధంగా కనిపిస్తుంటుంది. ఐతే గణిత సూత్రం.. దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు చెప్పడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తోంది. విశ్వంలోని వివిధ మూలకాలు.. అంశాల్ని చూసినప్పుడు.. ఏదో అత్యున్నత శక్తి పని చేస్తున్నట్లు చెప్తారు. దీనికి ఉదాహరణగా గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తుంది. గురుత్వాకర్షణశక్తి బలహీనంగా ఉంటే.. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఏర్పడేవి కాదు కదా.. గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉండే క్రిష్ణబిలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా అన్నది మరో ప్రశ్న.

సూన్ చెప్తున్న మాటలు.. ఫేమస్ సైంటిస్ట్‌ డిరాక్ మాటలను గుర్తు చేస్తున్నాయ్. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది. సూన్ చెప్పిన మాటలకు.. డిరాక్ పరిశోధనలకు చాలా పోలికలు ఉన్నాయ్‌. దీంతో ఇప్పుడు దేవుడు అనే మాట చుట్టూ మళ్లీ చర్చ మొదలైంది. దేవుడు లేకుండా ఇలా జరుగుతుందా ఇదంతా జరుగుతుందా అని ఆస్తికులు వాదన మొదలుపెట్టారు.

అస‌లు సూన్ ఏమ‌న్నాడు..

ఈ ప్రపంచం, విశ్వం అంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతుందని.. ఇలా జరగాలని ఉంది కాబట్టే.. అలా జరిగిందంటూ బిగ్‌బ్యాంగ్ థియరీని తెరమీదకు తీసుకువస్తున్నారు డాక్టర్ విల్లీ సూన్‌. భౌతిక శాస్త్ర నియమాలు కూడా అలాగే నడుస్తున్నాయని.. అన్నీ కరెక్ట్‌గా సెట్ చేసినట్టు ఉన్నాయన్నది ఆయన వాదన. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదని.. దీని వెనుక ఏదో ఒక శక్తి ఉందని.. అదే దేవుడు అని ఆయన గట్టిగా చెప్తున్నారు.

దీనికోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యాథ్స్ సైంటిస్ట్‌ పాల్ డిరాక్ చెప్పిన ఫార్ములాను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. నిజానికి 1963లోనే ఈ మిస్టరీపై పాల్ డిరాక్ స్వయంగా మాట్లాడారు. ప్రకృతి చాలా లోతైన, అందమైన, క్లిష్టమైన గణిత సూత్రాలను పాటిస్తుందని.. విశ్వం నిర్మాణం ఇలా ఎందుకు ఉందో అర్థం కావడం లేదంటూ కామెంట్‌ చేశారు. దేవుడు గొప్ప గణిత శాస్త్రవేత్త అయి ఉంటాడని.. అందుకే ఈ విశ్వాన్ని అంతా లెక్కలు వేసి క్రియేట్ చేసుంటాడని అన్నారు. డిరాక్ ఈ మాటలనే ఇప్పుడు సూన్ ప్రస్తావిస్తున్నారు. దేవుడు ఉన్నాడని వాదిస్తున్నారు.

ఫాదర్‌ ఆఫ్‌ యాంటీ మ్యాటర్‌ అని డిరాక్‌కు పేరు..

ఫాదర్‌ ఆఫ్‌ యాంటీ మ్యాటర్‌ అని డిరాక్‌కే పేరు. కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవటానికి ఆయన ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం.. క్వాంటమ్‌ మెకానిక్స్‌ నుంచి ష్రోడింగర్స్‌ ఫార్ములాని కలిపారు. మొదట్లో ఇది వర్కౌట్‌ కాలేదు. ఐతే ఆ తర్వాత చిన్న మార్పుతో ప్రయోగాలు సక్సెస్ అయ్యాయ్‌. విశ్వంలో దేవుడి రుజువును గుర్తించామని నమ్మే రిచర్డ్‌ స్విన్‌బర్న్, రాబిన్‌ కొలిన్స్‌లాంటి చాలామంది శాస్త్రవేత్తలు.. దీన్ని సరైన మేళవింపు వాదనగా చెప్తుంటారు. గురుత్వాకర్షణ బలం, ప్రొటాన్లు, ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి నిష్పత్తి.. విశ్వంతో ముడిపడిన స్థిరాంశాలను దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. ఇది చెప్తూనే దేవుడు అన్నాడని సూన్‌ బలంగా చెప్తున్నారు.

స్టీఫెన్‌ హాకింగ్‌లాంటి వాళ్లది మరో రకం అభిప్రాయం..

డిరాక్‌.. ఇప్పుడు సూన్ వాదనలు ఎలా ఉన్నా.. దేవుడి గురించి స్టీఫెన్‌ హాకింగ్‌లాంటి వాళ్లది మరో రకం అభిప్రాయం. తన చివరి పుస్తకం బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్‌లో దేవుడిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు హాకింగ్‌. ప్రకృతి నియమాలే దేవుడి పని అని అనుకోవచ్చు కానీ.. అది దేవుడిని నిర్వచించడం వరకే పరిమితం అవుతుందని.. ఆయన ఉన్నారని నిరూపించదంటూ హాకింగ్ చెప్పుకొచ్చారు. మనం ఏం నమ్మాలన్న మనిష్టం.. ఐతే దేవుడు లేడన్నదే తనకు కరెక్ట్ అనిపిస్తుందంటూ రాసుకొచ్చారు. ఇలా సూన్, స్టీఫెన్ హాకింగ్ ఇద్దరూ రెండు వేర్వేరు అభిప్రాయాలను చెప్పారు. ఒకరు గణితంలోని అందం దేవుడికి నిదర్శనం అంటే.. మరొకరు సైన్స్ మాత్రమే అన్నింటికీ సమాధానం అని నమ్మారు.