Justin Trudeau: సొంత పార్టీలో అసమ్మతి.. రాజీనామాకు సిద్ధమైన కెనడా ప్రధాని ట్రూడో.. ప్రకటన ఎప్పుడంటే?

ప్రధాని హోదాలో ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంతకాలంగా సొంత పార్టీలోని ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా భారతదేశం పట్ల ట్రూడో వ్యవహరిస్తున్న ..

Canada PM Justin Trudeau likely to resign as Liberal Party leader this week

Justin Trudeau: సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోపాటు.. కెనడియన్ల నుంచి రోజురోజుకు మద్దతు తగ్గుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారట. రాబోయే 48గంటల్లో లిబరల్ పార్టీ నాయకుడిగా ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బుధవారం లిబరల్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సొంత పార్టీ ఎంపీలు తనను లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పించే అవకాశం ఉందని భావిస్తున్న ట్రూడో అంతకుముందే లిబరల్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.

 

లిబరల్ పార్టీ నాయకత్వ పదవికి మంగళవారం ట్రూడో రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆయన ప్రధాని పదవికి కూడా రాజీనామా చేస్తారా.. లేదా కొత్త నేత ఎన్నికయ్యే వరకు కొనసాగుతారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై ప్రధాని కార్యాలయం స్పందించేందుకు సుముఖత చూపలేదు. ట్రూడో 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. 2015 సంవత్సరంలో పార్టీ అధికారంలోకి రావడంతో ట్రూడో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీని ట్రూడో ముందుండి నడిపించి విజయం సాధించారు.

 

కెనడాలో ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపినియన్ పోల్స్ ప్రకారం ట్రూడో తన ప్రధాన ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియారీ పోయిలీవ్రే కంటే 20 పాయింట్లు వెనకబడి ఉన్నాడని తేలింది. దీంతో అతను ఇంకా పార్టీ నాయకుడిగా కొనసాగితే లిబరల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని ఆ పార్టీ ఎంపీలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉంటే.. ట్రూడో రాజీనామా తరువాత ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ పార్టీ తాత్కాలిక నాయకుడిగా, ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ప్రధాని హోదాలో ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంతకాలంగా సొంత పార్టీలోని ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా భారతదేశం పట్ల ట్రూడో వ్యవహరిస్తున్న తీరును సొంత పార్టీలోని పలువురు ఎంపీలు తప్పుబట్టారు. మరోవైపు ట్రూడో మంత్రివర్గంలో ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కీలక వ్యక్తి. ఆమె ఇటీవల తన పదవికి రాజీనామా చేసి కేబినెట్ నుంచి తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆమెతో పాటు మరొకరు కేబినెట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ట్రూడోకు సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత పెద్దతలనొప్పిగా మారింది.

 

మరోవైపు ప్రజలుసైతం ట్రూడో పాలన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ట్రూడోను ప్రధాని పదవి నుంచి పక్కకు తప్పించేందుకు ప్రజలంతా ఎన్నికలకోసం వేచిచూస్తున్నారని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను బలపరుస్తూ ఎన్నికలకు వెళ్తే తీవ్రంగా నష్టపోతామని లిబరల్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రూడోపై పార్టీలో వ్యతిరేకత, ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం నేపథ్యంలో ఆయన్ను పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడమే మంచిదని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, మరో పది నెలల్లో ఎన్నికలున్న సమయంలో కొత్తగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి ప్రజల్లో అసంతృప్తిని ఏమేరకు సర్ధుమణిగించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతారనేది చర్చనీయాంశంగా మారింది.