Carrots And Celery May Negate Some Damage From Smoking
Carrots and celery may negate some damage from smoking : వాహనాల నుంచి వచ్చే పొగ..పరిశ్రమల నుంచి వెలువడే పొగతో వాయుకాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. వాయుకాలుష్యం కాటుకు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.భారతదేశంలో కాలుష్యం కాటుకు లక్షలాది ప్రాణాలు బలైపోగా మరెంతోమంది పలు అనారోగ్యాలకు గురి అయి నానా పాట్లు పడుతున్నారు. దీనికి తోడు ధూమపానం చేసే వారి శరీరంలో పేరుకుపోయే కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. భారత్ లో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి.
బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి ఎన్నో కాలుష్య కారకాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. అవి శరీరంలో పేరుకుపోయి అనారోగ్యాలకు గురి చేస్తున్నాయి. అటువంటి కాలుష్యాలను మన శరీరం నుంచి బయటకు పంపించేయాలి. అలా చేయాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలని. మన శరీరంలో పేరుకుపోతున్న కాలుష్యాలను పారదోలాలంటే క్యారెట్లు, సెలెరీ, కొత్తిమీర ప్రతీరోజు తినాలని పరిశోధకులు చెబుతున్నారు. క్యారెట్లు తినటం వల్ల శరీరంలోని కాలుష్యాన్ని బయటకు పంపేయవచ్చని సూచిస్తున్నారు.
అమెరికాలోని డెలావర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. సిగరెట్ పొగ, వాహనాల నుంచి వెలువడే పొగలో అక్రోలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మానికి నష్టం చేస్తుంది. ఎపియేషి కుటుంబానికి చెందిన క్యారెట్, సెలెరీ, ఆకుకూరల్లో కాలుష్య కారకాలను నాశనం చేసే పోషకాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.