China Brides Buying
China Brides Buying : చైనా నేపాల్‌పై కుట్రకు పాల్పడుతుందా..? నేపాలీలతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడం నిజమేనా..? నేపాలీ మహిళలతో చైనా పురుషుల షామ్ వెడ్డింగ్!.. లేక హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా? ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇదే చర్చ సాగుతోంది. చైనా వన్ చైల్డ్ పాలసీతో జనాభా తగ్గిపోవడం.. దాని తర్వాత బాల బాలికల నిష్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు జనాభా పెంచుకోవడానికి చైనా నానాతిప్పలూ పడుతోంది. ఈ క్రమంలో కుటుంబనియంత్రణ సాధనాలపై పన్ను కూడా పెంచింది.
నేపాల్‌లో చైనా కుట్రలు..
ఇదిలా సాగుతుండగానే.. చైనా పొరుగు దేశం నేపాల్‌లో కొత్త కలకలం బయలుదేరింది. చాలామంది యువతులకు ఉన్నట్లుండి పెళ్లి సంబంధాలు కుదరడం.. తర్వాత దేశం దాటి వెళ్తుండటం ఎక్కువ అయింది. దీంతో నేపాల్‌లో జరుగుతున్న కొన్ని పెళ్లిళ్లలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందనే ప్రచారం బయలు దేరింది. ఇది నిజమే అని నేపాల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా నిర్ధారించారు. వీరి పరిశీలన ప్రకారం నేపాలీ మహిళలు కొందరు చైనా జాతీయులతో కలిసి అద్దె నివాసాల్లో ఉంటున్నట్లు తేలింది. ఇదంతా కూడా షామ్ వెడ్డింగ్ అని చెప్తున్నారు.
పేద అమ్మాయిలు టార్గెట్..
పేద అమ్మాయిలను ఎంచుకుని మరీ కొందరు చైనా వాసులు డబ్బు ఎర చూపుతున్నారని.. తమతో నకిలీ పెళ్లికి అంగీకరింపజేసి.. ఆ తర్వాత గర్భం దాల్చే వరకూ కాపురం చేయడం.. పిల్లలు పుట్టగానే వారిని తీసుకుని వెళ్లేలా ఈ వ్యవహారం సాగుతుందని చెప్తున్నారు. ఈ రకపు పెళ్లిళ్లలో చట్టవ్యతిరేకం ఏమీ లేకపోయినా నైతికంగా మాత్రం నేపాలీ మహిళల అవసరాలను క్యాష్ చేసుకోవడమే. అంతేకాదు ఓ రకంగా ఇది హ్యూమన్ ట్రాఫికింగ్‌గా కూడా కొందరు వర్ణిస్తున్నారు.
నకిలీ వివాహాలపై నేపాల్ అలర్ట్..
చైనా నుంచి వచ్చే పురుషుల నుంచి నేపాల్‌లోని మ్యారేజ్ బ్రోకర్లు 5వేల యువాన్ల నుంచి లక్షా 88వేల యువాన్లు వసూలు చేస్తున్నారు. ఈ రకపు నకిలీ వివాహాలపై నేపాల్ కూడా అలర్టైంది. క్రాస్ బోర్డర్ మ్యారేజ్‌లను అడ్డుకునేందుకు నిఘా పెట్టింది. మ్యారేజ్ బ్రోకర్లను, తరచూ చైనా వెళ్లి వచ్చేవారిని స్క్రూటినీ చేస్తోంది. నేపాల్‌లోని చైనా ఎంబసీ కూడా బ్రైడ్ బయింగ్ అనే ట్రెండ్‌కి డ్రాగన్ కంట్రీ వ్యతిరేకమని.. న్యూఇయర్ పేరు చెప్పి ఫేక్ మ్యారేజ్‌లకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామంటూ అడ్వైజరీ నోట్ జారీ చేసింది. చైనా చట్టాలు కూడా ఇందుకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటి పెళ్లిళ్లతో పిల్లలు పుట్టినా వారిని చైనా జాతీయులుగా అంగీకరించే అవకాశాలు లేవని హెచ్చరించింది. కొంతకాలంగా నేపాల్‌లో ఫేక్ మ్యారేజ్ బ్రోకర్లు, ఇల్లీగల్ మ్యారేజ్‌లు బైటపడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాథాన్యత సంతరించుకుంది.
చైనీయులు ఇలా ఎందుకు చేస్తున్నారు..?
చైనీయులు ఇలా నేపాలీ మహిళల కోసం తప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణముందంటున్నారు. ఇక్కడి జనాభాలో లింగ నిష్పత్తి. ప్రతి వందమంది మహిళలకు 104మంది పురుషుల చొప్పున జనాభా ఉంది. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి కుటుంబ నియంత్రణ చర్యలతో మరింత ఎక్కువ అవుతోంది. దీంతో కొన్ని లక్షల మంది పురుషులకు వివాహాలు కావడం లేదు. దీంతోనే ఈ తరహా ఫేక్ మ్యారేజ్, క్రాస్ బోర్డర్ మ్యారేజ్‌లకు పాల్పడుతున్నట్లు రీసెర్చర్లు చెప్తున్నారు. చైనాలోని పురుషులు ఇదే తరహా కక్కుర్తికి పాల్పడుండటంతో గతేడాది బంగ్లాదేశ్ కూడా
ఇదే రకంగా స్పందించింది.
ఇక ఈ బెడదని అడ్డుకోవడానికి నేపాల్ విదేశీయులను ట్రాక్ చేయడానికి ఓ కొత్త సిస్టమ్‌ని జనవరి నుంచి తీసుకువస్తోంది. తమ దేశంలోకి వచ్చేవారు ఎక్కడ ఉంటారు.. ఎవరి సాయం తీసుకుంటున్నారు వంటి తదితర వివరాలను నమోదు చేసుకోబోతోంది. గత ఏడాది నేపాల్ వీసా నిబంధనలను మీరినందుకు 497మందిని బహిష్కరించింది.