×
Ad

చైనా వాడు మళ్లీ మొదలెట్టాడు.. ఈసారి ఏకంగా ఆర్టిఫిషియల్ దీవి.. ఏకంగా అణుబాంబు పడినా కూడా..

China artificial island : డ్రాగన్‌ మరో అడుగు ముందుకేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో సుమద్రంలో తేలియాడే ఆర్టిఫిషియల్‌ ఐల్యాండ్స్‌ను

China artificial island

China artificial island : అచీవ్‌ బిగ్‌.. క్రియేట్‌ వండర్స్‌ అనే నినాదంతో ముందుకెళ్తోంది చైనా. కనీసం ఇతర దేశాలు ఊహించని రీతిలో అద్భుతాలు చేయాలని చూస్తోంది. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా అణ్వాయుధాలపై ఫోకస్‌ పెడితే.. డ్రాగన్‌ మరో అడుగు ముందుకేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో అణ్వాయుధాల దాడులు, ప్రకృతి విపత్తులు, యుద్ధ ప్రమాదాల్లో ఎలా రక్షణ పొందాలనే దిశగా ఆలోచించింది. అవసరమనుకుంటే భూమి నుంచి సముద్ర జలాల్లోకి షిఫ్ట్‌ అయ్యేలా ఆర్టిఫిషియల్‌ ఐల్యాండ్‌ను క్రియేట్‌ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

భారీ ఎయిర్‌క్రాఫ్టుల్ని తీసుకెళ్లే బాహుబలి యుద్ధనౌక ఫుజియాన్‌ తరహాలో .. ప్రజలను సురక్షితంగా పదిలపరిచే కృత్రిమ ఐల్యాండ్‌ నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేసింది. 2028లో దీనికి కార్యరూపం ఇచ్చేందుకు పక్కా ప్లాన్‌తో ఉంది డ్రాగన్‌. 138 మీటర్ల పొడువు 85 మీటర్ల వెడల్పుతో .. నీటి ఉపరితలం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఈ ఐల్యాండ్‌ నిర్మాణాల్ని చేపట్టనున్నారు. గంటలకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ఈ కృత్రి మ ద్వీపం ప్రయాణిస్తుంది. సముద్రంలో 6 నుంచి 9 మీటర్ల ఎత్తున భారీ అలలు వచ్చినా, తుఫానుల్లాంటి పెను విపత్తులను కూడా తట్టుకోగల రీతిలో ఈ ఐల్యాండ్‌ను కృత్రిమ పద్ధతిలో నిర్మించబోతోంది చైనా. తుపానుల్లోనే అత్యంత తీవ్రమైన క్యాటగిరీ 17 తుపాన్లను తట్టుకునేలా చైనీ దీనిని ట్విన్ హాల్ విధానంలో రూపొందిస్తుంది.

భవిష్యత్‌ యుద్ధాల్లో శత్రుదేశాలపై అణ్వాయుధాలను వినియోగించే అవకాశాలున్నాయి. ఒకవేళ చైనాకు అలాంటి పరిస్థితులు ఎదురైతే.. ప్రజల్ని కాపాడుకోవడం కోసం.. ఆర్టిఫిషియల్‌ ఐల్యాండ్స్‌ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఐడియా రావడమే ఆలస్యమన్నట్లు వాటి నిర్మాణ ప్రక్రియకు డిజైన్లు రూపొందించింది. 78 వేల టన్నుల బరువుతో కృత్రిమ దీవిని నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. ఇలాంటి ఆర్టిఫిషియల్‌ ఐల్యాండ్‌లో ప్రజలు నాలుగు నెలలు పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అన్ని సౌకర్యాలతో బ్రతికేయొచ్చు.

మెటామెటీరియల్‌ శాండ్‌విచ్‌ ప్యానల్స్‌ను వాడుతూ సముద్రంలో తేలేలా నిర్మించే ఈ నిర్మాణాలు ప్రకృతి విపత్తులు, యుద్ధ ప్రమాదాల నుంచి కాపాడుతాయి. ఆహారం, నీరు, విద్యుత్తు, కమ్యూనికేషన్‌ సదుపాయం, నేవిగేషన్‌ కంట్రో ఇలా ఈ మినీ ద్వీపంలోనే అన్ని వతావరణ పరిస్థితుల్ని తట్టుకుని దీర్ఘకాలం నీళ్లలోనే నివాసం ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇందులో ఉంటాయి. ఈ కృత్రిమ మొబైల్‌ దీవుల్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది డ్రాగన్‌ అల్టిమేట్‌ ప్లాన్‌. ఏదేమైనా చైనా కృత్రిమ దీవుల నిర్మాణం ఐడియా చూసి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ముక్కున వేలేసుకుని నివ్వెరపోతున్నాయి.

సముద్ర గర్భంలో పరిశోధనల కోసమే ఈ మెగా సైన్స్ ప్రాజెక్టు అని చైనా చెబుతుంది. అయితే, సముద్ర జలాల్లో సైనికపరమైన అధిపత్యం కూడా మరో కారణమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్ర గర్భంలోని వనరులను వెలికితీయడం, పునరుత్పాదక ఇందనాన్ని సముద్రం నుంచి ఉత్పత్తి చేయడం వంటి పరిశోధనలకు చైనా ప్రాధాన్యం ఇస్తుంది. తద్వారా ప్రపంచ దేశాలకన్నా ముందే ఈ రంగంలో అడుగు పెట్టి అగ్రస్థానం కైవసం చేసుకోవాలని ఆ దేశం భావిస్తోన్నట్లు కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో మోహరించే లక్ష్యంతో కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దక్షిణ చైనా సముద్ర జలాలపై పూర్తి ఆధిపత్యం కోసం చైనా కొంతకాలంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు వెనుక సైనిక లక్ష్యాలు కూడా ఉండోచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నారు.