China
Corona Delta variant : కరోనా మొదటి వేవ్ ను ఎదుర్కొన్న చైనా..ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటోంది. నిన్న ఆ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కాగా జూలై 20 నుంచి చైనాలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. నాన్‌జింగ్ నగరంలోని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో తొలిసారి డెల్టా కేసులు బయటపడ్డాయి. కొన్ని రోజుల్లోనే 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు నమోదయ్యాయి.
అనంతరం చైనా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. డెల్టా వేరియంట్ దూసుకువెళ్తున్న తీరును చాలెంజ్‌గా తీసుకున్న చైనా.. ఆ వైరస్ వేరియంట్‌ను సమర్థవంతంగా నిలువరిస్తోంది. డెల్టా వేరియంట్ కేసులు నమోదు కాగానే.. స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించారు. లక్షలాది మందిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. భారీ స్థాయిలో టెస్టింగ్, ట్రేజింగ్ చేపట్టారు. స్వదేశీయంగా ప్రయాణాలను నియంత్రించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయడం చైనాకు కలిసివచ్చినట్లు కనిపిస్తోంది.
రోజు వారీ పాజిటివ్ కేసులు తగ్గాయి. వందల సంఖ్య నుంచి సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి. చైనాలో నిన్న విదేశాల నుంచి వచ్చిన వారిలో 21 కేసులు నమోదయ్యాయి. కాగా స్థానికంగా మాత్రం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. లక్షణాలు ఉన్నవారిని, లక్షణాలు లేని వారి గురించి చైనా ప్రభుత్వం వేర్వేరు డేటాను రూపొందిస్తుంది. అయితే లక్షణాలు లేని వారిని.. వైరస్ పాజిటివ్ కేసుల్లో కలపడం లేదు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే కనుక ప్రపంచంలో డెల్టా వేరియంట్ దూకుడును అడ్డుకున్న తొలి దేశంగా చైనా నిలుస్తుందని అధికారులు అంటున్నారు.