జాక్ మా వ్యాపారాలపై కమ్యూనిస్ట్ దేశం కన్నెర్ర

China Orders Ant Group to Revamp Its Business చైనాలో దిగ్గజ కంపెనీ అలీ బాబా, ఆ సంస్థ అధినేత జాక్ మాను ఆ దేశం టార్గెట్ చేసింది. జాక్ మాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్..దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చైనీస్ రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి. అత్యంత ముఖ్యమైన సమాచారం అందడంతో చైనా పరిపాలన, మార్కెట్ రెగ్యులేషన్ అధికారులు అలీ బాబా కంపెనీ మీద విచారణ జరుపుతున్నారు

ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్ ‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్.. లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు సూచించారు.

యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌‌లను చైనీస్ సెంట్రల్‌‌ బ్యాంక్‌ లేదా పీపుల్స్‌‌ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రశ్నించింది. బిజినెస్‌‌ రీస్ట్రక్చర్‌‌ ప్లాన్‌‌ను రెడీ చేయాలని‌‌ , ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని ఆదేశించింది. దీంతో క్రెడిట్‌‌, ఇన్సూరెన్స్‌‌, వెల్త్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బిజినెస్‌‌లను యాంట్‌‌ గ్రూప్‌‌ రీస్ట్రక్చర్‌‌‌‌ చేయాల్సి వస్తుంది. యాంట్‌‌ గ్రూప్‌‌లో గవర్నెన్స్ బాగోలేదని, రెగ్యులేటరీ నిబంధనలను కంపెనీ ఫాలో కావడం లేదని చైనా సెంట్రల్‌‌ బ్యాంక్ సీరియస్ అయింది.

అయితే, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్‌మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, ఒకప్పుడు స్కూల్ టీచర్ అయిన జాక్ మా ఆ తర్వాత చైనాలో అత్యంత సంపన్న కుబేరుడిగా ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ వ్యాపారవేత్త అయ్యారు. సంఖ్యా పరంగా చూస్తే అలీబాబా అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ప్లాట్ ఫాం. దానికి కోట్లాది మంది యూజర్లు, అలాగే, బిలియన్ల డాలర్ల టర్నోవర్ ఉంది. ప్రముఖ వ్యాపార మేగజీన్ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం “అలీబాబా” ఆసియాలోనే అత్యంత విలువైన కార్పొరేషన్.

అలీబాబా కంపెనీలో ప్రధానంగా మూడు ముఖ్యమైన సైట్లు ఉన్నాయి. అవి Taobao, Tmall, Alibaba.com. ఈ మూడింట్లో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేస్తున్నారు. Ant(యాంట్) గ్రూప్ ఐపీఓను నవంబర్‌లో రద్దు చేశారు. ఆ తర్వాత కంపెనీకి ప్రాబ్లం ప్రారంభమైంది. ఇప్పుడు విచారణకు ఆదేశించింది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది.

మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా యాంట్ కంపెనీ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణల మీద విచారణ జరగనుంది. ఒక కంపెనీ తన ప్లాట్ ఫాం మీద వస్తువులు విక్రయించాలంటే మరే దాంట్లో కూడా దాన్ని విక్రయించకూడదనేలా నిబంధనలు విధిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తన ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెట్టేందుకు అలీబాబా అనుసరించిన ఈ వ్యూహం చైనాకు ఆగ్రహాన్ని తెప్పించింది. మరోవైపు అలీబాబా మాతృ సంస్థ యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.