Boeing Jet Delivery
Boeing Jet Delivery : ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించింది. అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారీగా క్షీణించాయి. అమెరికాతో వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి విమానాల డెలివరీని చైనా నిలిపివేసింది.
బోయింగ్ కంపెనీ నుంచి కొత్త విమానాలను కొనుగోలు చేయవద్దని, అమెరికా నుంచి విమాన పరికరాలు లేదా విడిభాగాలను కొనుగోలు చేయవద్దని చైనా తన విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాలను లీజుకు తీసుకుని, ఇప్పుడు వాటిపై అధిక ఖర్చులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు సాయం చేసేందుకు చైనా ఇప్పుడు మార్గాలను అన్వేషిస్తోంది.
చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 145 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత చైనా అగ్రరాజ్యానికి గట్టి షాకిచ్చింది. అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు విధించింది. దానికి ప్రతీకారంగా, చైనా కూడా అమెరికాపై 125 శాతం సుంకాన్ని విధించింది.
ఎక్కడికెక్కడ నిలిచిపోయిన విమానాలు :
ఏవియేషన్ ఫ్లైట్స్ గ్రూప్ డేటా ప్రకారం.. దాదాపు 10 బోయింగ్ 737 మాక్స్ విమానాలు నిలిచిపోయాయి. ఇందులో చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ కో., ఎయిర్ చైనా లిమిటెడ్, జియామెన్ ఎయిర్‌లైన్స్ కో. నుంచి రెండు చొప్పున ఉన్నాయి.
కొన్ని విమానాలు అమెరికాలోని సీటెల్‌లోని బోయింగ్ ఫ్యాక్టరీ స్థావరం సమీపంలో పార్క్ చేయగా, మరికొన్ని తూర్పు చైనాలోని జౌషాన్‌లోని ఫినిషింగ్ సెంటర్‌లో ఉన్నాయి. చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద విమానయాన మార్కెట్. బోయింగ్ 2018లో మొత్తం విమానాలలో 25 శాతానికి పైగా చైనాకు సరఫరా చేసింది. కానీ, 2019లో రెండు విమానాలు కూలిపోయిన తరువాత చైనా మొదట బోయింగ్ 737 మాక్స్‌ను నిలిపివేసింది.
సుంకాల విషయంలో పోటాపోటీగా రెండు దేశాలు :
అమెరికా చైనాతో సహా ఇతర దేశాలకు ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై విధించిన పరస్పర సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. సుంకాల విషయంలో అమెరికా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటోందని చైనా స్పష్టంగా చెబుతోంది. అదే సమయంలో, అమెరికాకు భారీ నష్టం కలిగించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు.