అమెరికాలో మా విద్యార్థుల వీసాల రద్దు జాతివివక్షే, భోరుమన్న చైనా

  • Publish Date - September 11, 2020 / 01:16 PM IST

china student visa cuts: అమెరికాలో చైనా విద్యార్థుల వీసాల రద్దు నిర్ణయంపై డ్రాగన్‌ కంట్రీ తీవ్రంగా స్పందించింది. దాదాపు వెయ్యి మందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. వీసాలు రద్దు రాజకీయ కక్ష మాత్రమేకాదు, జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.

రాజకీయ కారణాలతో చైనా విద్యార్థులను అణచిస్తున్నారని, వెంటనే ఆపాలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లిజియాన్ స్పష్టం చేశారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.



తమ దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా మిలటరీకి చేరవేస్తున్నారంటూ వెయ్యి మందికిపైగా విద్యార్థుల వీసాలను అమెరికా రద్దు చేసింది . చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీకి సంబంధాలున్నాయన్నది అమెరికా అనుమానం. ఇది కొంతవరకు నిజంకూడా. విదేశాల్లో పనిచేసే చైనా నిపుణులు కీలకమైన సమాచారాన్ని చైనాకు తీసుకెళ్తారని అంతర్జాతీయంగా ఆరోపణలున్నాయి.

అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్ ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు,గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా పరిశోధనా సమాచారాన్ని దొంగలించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఆరోపించింది.



https://10tv.in/china-planning-building-spree-in-tibet-as-india-tensions-rise-sources-say/
ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకు లోబడివచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని స్పష్టం చేసింది. హాంగ్‌కాంగ్‌లో చైనా ఆగడాలను అరికట్టే చర్యల్లో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.



https://10tv.in/japan-offers-perks-to-its-companies-moving-to-india-from-china/
కొద్ది నెలలుగా అమెరికా-చైనా మధ్య దౌత్యపరమైన, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇక కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి పంపిందంటూ ఇప్పటికే చైనాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికా, చైనాల మధ్య అన్ని రకాలుగా సంబంధాలు తెగిపోయాయి.