Russia China: రష్యాకు విమాన పరికరాలను నిలిపివేసిన చైనా: భారత్ కు కలిసొచ్చే అవకాశం

రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.

Russia China: యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా పై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించగా.. ఆసియా దేశాలు అంతగా స్పందించలేదు. యుక్రెయిన్ పై రష్యా దాడులు ఆపకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రష్యాకు మద్దతిస్తున్న దేశాలపైనా విమర్శలు వస్తున్నాయి. రష్యాకు మిత్ర దేశాలైన భారత్, చైనాలు.. రష్యాను నిలువరించే ప్రయత్నం చేయడం లేదంటూ అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.

Also read: Russia Ukraine War: మానవతా మార్గాల ద్వారా 35 వేల మంది యుక్రెయిన్ పౌరుల తరలింపు

దీంతో రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పశ్చిమదేశాల సరసన చైనా కూడా చేరినట్లయింది. రష్యాకు చైనా విమాన పరికరాల సరఫరా నిలిపివేతపై రోసావియాట్సియా(రష్యా) ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారి వాలెరీ కుడినోవ్ స్పందిస్తూ.. రష్యాలోని విమానయాన సంస్థలు.. తమ సంస్థల తరుపున ప్రత్యకంగా చైనా సంస్థలతో సంప్రదింపులు జరుపుకోవాలని సూచించారు. రష్యాకు చైనా విమానపరికరాల నిలిపివేతతో.. రష్యా విమానయాన సంస్థల ద్రుష్టి ఇప్పుడు భారత్ లేదా టర్కీ దేశాలపై పడనుంది. యూరోప్ దేశాలు సైతం విమాన విడిభాగాల సరఫరా నిలిపివేయడంతో, రష్యా ఇకపై భారత్ పైనే ఆధారపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: Ukraine Russia War: ఒట్టి చేతులతో భారీ బాంబును నిర్వీర్యం చేసిన యుక్రెయిన్ బాంబు స్క్వాడ్: వీడియో

కాగా వాలెరీ కుడినోవ్ చేసిన ప్రకటనపై రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ స్పందిస్తూ.. ఆయనకు ప్రకటనలు చేసే అధికారం లేదని పేర్కొంది. వాలెరీ కుడినోవ్ తన ఆధీనంలోని ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ యొక్క అధికారిక పనులు చక్కబెట్టడమే ఆయనకు ఇచ్చిన విధులని ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే.. చైనా నిజంగానే రష్యాపై ఆంక్షలకు దిగిందా? లేక ముడిసరుకు ఇబ్బందుల కారణంగా విమాన పరికరాల సరఫరా నిలిపివేసిందా అనే ప్రశ్న తెలత్తుతోంది. రష్యా చైనా దేశాలు దౌత్య పరంగా ఎంతో దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు