Chinas Ai Tech Helping To Russia Building Army Of Robot Weapons
Russia Army AI Robot Weapons : ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న డ్రాగన్ చైనా.. రష్యాకు ఆర్మీ రోబో ఆయుధాల అభివృద్ధిలో సాయం అందిస్తోంది. రష్యా ఆర్మీ రోబోల ఆయుధాలను అభివృద్ధి చేస్తుంటే.. చైనా ఏఐ టెక్నాలజీ అందుకు సహకారం అందిస్తోంది. రష్యా తమ మిలటరీని మోడ్రానైజ్ చేయడానికి డ్రాగన్ ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సాయం తీసుకుంటోంది. చైనా అందించే ఏఐ మెరుగైన సాంకేతికతల సాయంతో రష్యా స్వంత రక్షణ కోసం రోబోలతో ఆయుధ దళాన్ని సమకూర్చుకుంటోంది.
ఆధునిక సామర్థ్యాలను పెంచుకోనేందుకు రష్యా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో సహకారాన్ని అందించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మిలటరీలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల్లో ఒకరిపై మరొకరు కాలుదువ్వుకున్న ఈ రెండు దేశాల మధ్య పరస్పర మైత్రి పెరిగిపోతూ వస్తోంది. దీనికి కారణం.. క్షిపణుల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థను నిర్మించడంలో చైనాకు రష్యా సాయం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. రెండు దేశాలు తమ C4ISR ను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక దళాల్లో AI సాంకేతికతను చేర్చనున్నాయి. దశాబ్దాల కాలంలో రష్యా, చైనాల మధ్య రాజీ కొనసాగుతోంది. రక్షణపరంగా ఎంతో రహస్యంగా సహకారాన్ని అందించుకుంటున్నాయి. రష్యా మిలటరీ అభివృద్ధి చేస్తున్న రెండు డజను ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలో కొంతవరకు AI సాంకేతికను అందించనుంది. ఇందులో భూమి, గాలి, సముద్ర మార్గాల్లో ప్రయాణించగల వాహనాలు ఉన్నాయి. అంతేకాదు.. ఆయుధాలను వాడటంతో పాటు వాహనాలను నడపటం, అంతరిక్షంలోకి ప్రయాణించగల సామర్థ్యాన్ని రష్యా ఆర్మీ హ్యుమన్ రోబోలకు ఉందని నివేదికలు వెల్లడించాయి.
రష్యా ఏఐ సైనిక సామర్థ్యాలతో రోబోట్ల తయారీని ప్రారంభించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్ ఇదివరకే ప్రకటించారు. సైన్స్-ఫిక్షన్ మూవీలలో మాదిరిగానే రోబోట్లు అవే సొంతంగా పోరాడగల సామర్థ్యం కలిగి ఉంటాయని అన్నారు. రష్యాలో AI- సంబంధిత కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దేశ జిడిపి కంటే 10 రెట్లు వేగంగా పెరుగుతోందని మరో నివేదిక వెల్లడించింది.