China Covid-19: మహమ్మారిని వాడేసుకుని దూసుకుపోతున్న చైనా

ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా. కరోనా పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.

China Covid

China Covid-19: ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా. కరోనా పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. చైనాతో పోటీ పడుతున్న పలు దేశాలు కరోనా సెకండ్‌ వేవ్‌ సవాళ్లలో కూరుకుపోవడమే ఇందుకు కారణం. చైనా ప్రపంచ ఎగుమతులు ఏప్రిల్‌లో ఏకంగా 32.3 శాతం పెరిగాయి. విలువలో 263.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఇక దిగుమతులు సైతం 43.1 శాతం పెరిగి 221.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ శుక్రవారం విడుదల చేసిన డేటాను బట్టి.. ఏప్రిల్‌ ఎగుమతులు 24.1 శాతం అంచనాలకు మించి పెరగడం గమనార్హం. మార్చిలో వృద్ధి రేటు 30.6 శాతంగా ఉంది. దిగుమతుల విషయానికి వస్తే, మార్చిలో 38.1 శాతంగా ఉంది వాటి పెరుగుదల రేటు.

ప్రపంచ దేశాలతో పోల్చితే చైనా వస్తు డిమాండ్‌ మెరుగుపడిందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ముడి ఇనుము, ఇతర కమొడిటీ ధరలు అంతర్జాతీయంగా పెరగడం కూడా చైనా ఎగ్జిమ్‌ (ఎగుమతులు–దిగుమతులు) డిమాండ్‌కు సానుకూలత చేకూర్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్‌–19 నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చితే చైనా ఎకానమీ ముందే ప్రారంభంకావడం గమనార్హం. మాస్కులు, ఇతర వైద్య సంబంధ ఎగుమతులు చైనా నుంచి భారీగా పెరిగాయి.

తమ దేశం నుంచి ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతులు పెరగడానికి చైనా వినూత్న విధానాలను చేపడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ వార్తల ప్రకారం భారత్‌ వంటి పలు దేశాలఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం.

చైనా.. 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్‌ డాలర్లు) నమోదుచేసుకుంది.