China Floods : చైనాలో భీకర వరదలు.. నీటమునిగిన ఐఫోన్ సిటీ, లక్షమంది తరలింపు.. గత వెయ్యేళ్లలో తొలిసారి

చైనాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెంట్రల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు... అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.

China Floods : చైనాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెంట్రల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు… అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. రాత్రికి రాత్రి పడిన కుండపోత వానతో… వాహనాలన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి.

ముఖ్యంగా హెనన్‌ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత వెయ్యి ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు 12మంది మృతిచెందారు. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

హెనన్‌ ప్రావిన్స్‌.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ కూడా ఇక్కడే ఉంది. ఈ రాష్ట్రంలో గత శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ‘ఐఫోన్‌ సిటీ’గా పిలిచే ప్రావిన్స్‌ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జెంగ్జౌ నగరం జలదిగ్బంధమైంది. ఆ నగరంలో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఆ నగరంలో 457.5 మిమి వర్షపాతం నమోదైంది.

ఈ వరదల ప్రభావం 12 ప్రధాన నగరాలపై పడింది. రహదారులను మూసేశారు. విమాన సర్వీసులూ రద్దయ్యాయి. 9.4 కోట్ల జనాభా ఉన్న హెనన్​ ప్రావిన్సులో ప్రభుత్వం అత్యంత ప్రమాదకర వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. వరదలకు చాలా రకాల కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా భూమి వేడెక్కడం లాంటి వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ అన్నారు. ఇప్పుడు హెనన్ ప్రావిన్స్ వారికి మరో ముప్పు పొంచి ఉంది. ఈమధ్య వరుస తుఫాన్ల వల్ల దగ్గరలోని డ్యామ్ దెబ్బతింది. ఇప్పుడు వరదల దాటికి అది ధ్వంసమైతే… ఇక జల ప్రళయమే అని అంతా భయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు