City Killer Asteroid
City Killer Asteroid : అతిపెద్ద భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. వామ్మో.. స్టేడియం సైజు అంతా భారీ పరిమాణంలో ఉందట.. ఈసారి భూమిమీదకి కాదు.. చంద్రుడివైపు వేగంగా దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని నాసా వెల్లడించింది.
ప్రస్తుతానికి ఈ గ్రహశకలంతో భూమికి ఎలాంటి ముప్పులేదని చెబుతోంది. కానీ, చంద్రుడిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాసా అంటోంది. గతంలో కన్నా భూమి వైపు దూసుకొస్తుందని అంచనా వేసినప్పటికీ ఇప్పుడు అది క్రమంగా చంద్రునివైపు వేగంగా కదులుతోందని నాసా తెలిపింది.
2024 YR4 అనే ఈ గ్రహశకలాన్ని మొదట గుర్తించిన సమయంలో 2032లో భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని నాసా హెచ్చరించింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం 0.004 శాతంగా చాలావరకూ తగ్గిందని అంటోంది.
3.8 శాతం ఢీకొనే అవకాశం :
ఈ అతిపెద్ద ఆస్ట్రరాయిడ్ 2032 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే ఛాన్స్ 1.7 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగినట్లు నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. వచ్చే మే నుంచి ఈ భారీ గ్రహశకలంపై లోతుగా అధ్యయనం చేయబోతున్నామని అంటున్నారు.
2032లో ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3 శాతంగా ఉందని శాస్త్రవేత్తలు గతంలో విశ్వసించారు. కానీ, కొన్ని వారాల్లోనే ఆ సంఖ్య 0.28 శాతానికి పడిపోయింది. కానీ, శాస్త్రవేత్తలు లోతుగా అన్వేషించగా.. ఇప్పుడు ఆ గ్రహశకలం చంద్రుని వైపు కదులుతుందోని గుర్తించారు.
2032లో ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొనే అవకాశం 2 శాతానికి పెరిగిందని ఖగోళ శాస్త్రవేత్త ఆండ్రూ రివ్కిన్ హెచ్చరించారని న్యూ సైంటిస్ట్ నివేదించింది. ఈ సంఖ్య నాసా గతంలో అంచనా వేసిన 1.7 శాతం కన్నా కొంచెం ఎక్కువే. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గ్రహశకలం గమనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
చంద్రుడిని ఢీకొంటే ఏమవుతుంది? :
ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే.. అంతరిక్షంలో భారీ పేలుడు సంభవించవచ్చు. బిలియన్ల సంవత్సరాలుగా చంద్రుని ఉపరితలంపై ఒక పెద్ద బిలాన్ని సృష్టించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకారం.. భూమి, చంద్రునిపై గ్రహశకలాలు ఢీకొనడం గతంలో సర్వసాధారణం.
కానీ, ఇప్పుడు అలాంటి సంఘటనలు చాలా అరుదుగా మారాయి. గ్రహశకలం డీకొట్టే చంద్రుడిపై ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనేదానిపై అధ్యయనం చేసేందుకు ఖగోళ సైంటిస్టులకు అరుదైన అవకాశం దొరుకుతుంది.
నాసా ఏం చేస్తోంది? :
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం గురించి మే 2025లో మళ్లీ అధ్యయనం చేస్తారు. ఇన్‌ఫ్రా రెడ్ అబ్జర్వేషన్ల సాయంతో ఈ గ్రహశకలం పరిమాణాన్ని అంచనా వేశారు సైంటిస్టులు. వెబ్ స్పేస్ అంచనాల ప్రకారం.. ఈ గ్రహశకలం పరిమాణం 53 నుంచి 67 మీటర్లు.. అంటే, సుమారు 10 అంతస్తుల బిల్డింగ్ సైజు పరిమాణంలో ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.