Mount Nyiragongo Volcano
Mount Nyiragongo Volcano ఆఫ్రికాలోని కాంగో దేశంలోని ఇరగోంగో అగ్నిపర్వం విస్పోటనం చెందింది. గోమా నగరానికి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం శనివారం రాత్రి ఒక్కసారిగా విస్ఫోటనమవడంతో..చిమ్ముతున్న లావాతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారిపోయింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారి వైపు వచ్చింది.
దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయినట్లు కాంగో అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సుమారు 7వేల మంది ప్రజలు కాంగోను విడిచి ఆశ్రయం కోసం పొరుగునున్న రువాండా దేశానికి వెళ్లారని సమాచారం. లావా.. గోమా వైపుకంటే రువాండా వైపు వెళ్తోందని సైంటిస్ట్ చార్లెస్ పేర్కొన్నారు.
ఆదివారం నాటికి గోమా శివార్లలోని బుహినీ దగ్గర లావా ప్రవాహం ఆగిపోయిందని నార్త్ కివు ఫ్రావిన్స్ మిలటరీ గవర్నర్ తెలిపారు. గోమా సిటీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకుందని తెలిపారు. ఈ ఘటనపై ఐరాస శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లటం లేదని తెలిపింది. ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇరగోంగో అగ్నిపర్వతం 2002లో మొట్టమొదటి సారిగా విస్ఫోటనం చెందగా..250 మంది మృతిచెందగా, 120,000 మంది నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన అగ్నిపర్వతాలలో ఒకటిగా పరిగణించవచ్చని అధికారులు చెబుతున్నారు.