ప్రపంచ దేశాలపై కరోనా పంజా…12 లక్షలు దాటిన బాధితులు…ఒక్కరోజే 65వేలకుపైగా కొత్త కేసులు 

  • Publish Date - April 6, 2020 / 01:01 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల  66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్‌…  ఇప్పుడు  ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్‌  ప్రపంచం  కోవిడ్‌ దెబ్బకు  దెబ్బకు హడలిపోతోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతోంది.

ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్‌ కేసులు  
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల  66వేలు దాటింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  కరోనా మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా కరోనా రాకాసి బలితీసుకుంది. ఇక కరోనా బారినపడ్డ… దాదాపు 2 లక్షల 61వేల మంది కోలుకున్నారు. అయితే మరో 45వేల మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

అమెరికాలో 3 లక్షల  34వేలకుపైగా కేసులు 
కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల  34వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 23వేల కేసులదాకా కొత్తవి నమోదయ్యాయి. అదే  సమయంలో అగ్రారాజ్యంలో కోవిడ్‌ మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.  నిన్న ఒక్కరోజే వెయ్యి మందికిపైగా మరణించారు. 

ఇటలీలో కరోనా  కరాళనృత్యం 
ఇటలీలో కరోనా  కరాళనృత్యం చేస్తోంది. కరోనా పంజాకు ఇటలీ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలు కరోనా బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు ఇటలీలో కరోనా.. 15వేల 887  మందిని బలితీసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 525మంది చనిపోయారు.  కరోనా మరణాలు ఇప్పటి వరకు ఇటలీలోనే ఎక్కువగా సంభించాయి. ఈ  వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య లక్షా 28వేలు దాటింది. నిన్న కొత్తగా మరో 4వేల  3వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇక ఇటలీలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 21వేల మంది కోలుకోగా… మరో 4వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

స్పెయిన్‌లోనూ కోరలు చాస్తోన్న కరోనా 
స్పెయిన్‌లోనూ కరోనా కోవిడ్‌ కోరలు చాస్తోంది. కరోనా రాకాసి దాహానికి  స్పెయిన్‌ విలవిల్లాడుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో లక్షా 30వేల మంది కరోనా బారిన పడ్డారు. నిన్న కొత్తగా 5వేల మందికి ఈ వైరస్‌ సోకింది. ఇక  ఇప్పటి వరకు ఈ దేశంలో 12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజే 571మంది ఈ వైరస్‌ బారినపడి చనిపోయారు. ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది స్పెయిన్‌లోనే. 

బ్రిటన్‌లో 47వేల కరోనా కేసులు  
ఇక బ్రిటన్‌లో కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. దీంతో ఈ దేశంలో పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా కేసులు 47వేలు దాటాయి. నిన్న కొత్తగా మరో 6వేల కేసులు నమోదయ్యాయి.  యూకేలో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. కరోనా నియంత్రణకు బ్రిటన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయినా వైరస్‌ వ్యాప్తి మాత్రం కట్టడి కావడం లేదు.

ఫ్రాన్స్ లో 92వేలకు చేరిన బాధితులు 
ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది.  దీంతో ఈ దేశంలో బాధితుల సంఖ్య 92వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 3వేల మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ దేశంలో కరోనా బారినపడి ఇప్పటి వరకు 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. నిన్న  ఒక్కరోజే  621మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో ఫ్రాన్స్‌ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.(తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా…334కు పెరిగిన కేసులు)

జర్మనీలో కరోనాతో 1576 మంది మృతి 
జర్మనీలో కోవిడ్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరింది. జర్మనీలో ఇప్పటి వరకు కరోనాతో 1576మంది చనిపోయారు.  నిన్న కొత్తగా 132 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఇక ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 150 మంది చనిపోయారు. టర్కీలో 73మంది, స్విట్జర్లాండ్‌లో 50మంది, బెల్జియంలో 164 మందిని కరోనా బలితీసుకుంది. నెదర్లాండ్‌లో 115 మంది కరోనాతో కన్నుమూశారు.