కరోనా మరణాల అప్‌డేట్: చైనా కంటే ఇతర దేశాల్లోనే!

  • Publish Date - March 17, 2020 / 12:29 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కువ ప్రాణాలను బలిగొంటుంది. చైనాలో మరణాల కంటే మిగిలిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువని, చనిపోతున్నావారి శాతం కూడా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

ఏఎఫ్‌పీ వార్తాసంస్థ లెక్కల ప్రకారం 142 దేశాల్లో 1,75,536 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 7007కు చేరుకుంది. అందులో చైనాలో 3,213 మంది మరణించగా, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 297 మంది చనిపోయారు. వైరస్‌ అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే ప్రపంచ దేశాలకు సూచనలు చేసింది.

ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న నిర్ధారిత కేసుల సంఖ్య నాలుగువారాల్లో 4500కి పెరిగింది. ఇరాన్‌లో ఈ సంఖ్య 12,700కి చేరింది.  ఇటలీలో 24వేల మందికి వైరస్‌ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య రెండు వేలు దాటింది. స్పెయిన్‌లోనూ నాలుగు వారాల వ్యవధిలో కోవిడ్‌ కేసుల సంఖ్య 8 నుంచి 6 వేలకు పెరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య తక్కువే. అయినా కూడా ప్రభుత్వాలు అప్రమత్తతగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 114 కరోనా కేసులు నమోదయినట్లుగా అధికారులు చెబుతున్నారు.