3లక్షలు దాటిన కరోనా కేసులు…1.8కోట్ల భారతీయుల ప్రాణాలు బలితీసుకున్న 1918 ఫ్లూ కంటే ప్రమాదకరం

కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 95 వేల మందికిపైగా కోలుకున్నారు. మరో 1,89,000 మంది పరిస్థితి నిలకడగా ఉండగా, 9,300 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉంది.

 ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో తెలియక ప్రపంచం ఆందోళన చెందుతోంది. వివిధ దేశాలు కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి ప్రయత్నిస్తున్నా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా ఇటలీలో కరోనా కరళానృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు ఆ దేశంలోని వయోధికులు మొత్తం తుడిచిపెట్టుకుపోతోంది. ఇటలీలో వైరస్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం దాదాపు 800 మంది మృతిచెందగా .. మరణాల సంఖ్య 4,800 దాటేసింది. కొత్త కేసులు కూడా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ఇటలీలోని లొంబార్డే ప్రాంతంలోనే అత్యధికంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

188 దేశాలకు విస్తరించిన ఈ వైరస్..1918లనాటి స్పానిష్ ఫ్లూ కంటే ప్రమాదికారిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ.. 1.7 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది భారతీయులను బలితీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది అధికం. భారత ప్రజల్లో ఆరు శాతం మంది చనిపోయారు.పురుషుల కన్నా మహిళలు అధికంగా చనిపోయారు. పోషకాహార లోపంతో పాటు.. అపరిశుభ్రమైన, గాలీవెలుతురు సరిగా లేని నివాసాలు, రోగం బారిన పడిన వారికి సేవలు చేస్తుండటం దీనికి కారణం. ఆ మహమ్మారి ప్రపంచంలో మూడో వంతు ప్రజలకు సోకిందని భావిస్తారు. దానివల్ల మొత్తంగా 5 నుంచి 10 కోట్ల మంది వరకూ చనిపోయారని అంచనా. 

1918 నాటి స్పానిష్ ఫ్లూ యాంటీబయాటిక్ శకానికి ముందు దాడిచేసింది. అత్యంత తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స అందించటానికి సరిపడా వైద్య పరికరాలే లేవు. పాశ్చాత్య ఔషధాలను భారతదేశంలో అంతగా ఆమోదించేవారు కాదు కూడా. చాలా మంది జనం దేశీయ మందుల మీదే ఆధారపడ్డారు. స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా వ్యాపించటానికి మూలం.. తీవ్ర జనసమ్మర్థంతో కూడిన ముంబైలో అది మొదలుకావటమే. ఇప్పుడు వైరాలజిస్టులను భయపెడుతున్నదీ ఇదే.నాటి – నేటి మహమ్మారుల మధ్య కొన్ని సారూప్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. స్పానిష్ ఫ్లూ నుంచి, దానిని ఎదుర్కొనే విషయంలో చేసిన పొరపాట్ల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండొచ్చు.