చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు. ఇప్పటివరకు చైనాలో 1600మందికి పైగా మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 66వేలమందికి వైరస్ సోకినట్లు తేలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఇక శనివారం యూరప్ లో మొదటి కరోనా మృతి నమోదైంది. చైనా నుంచి ఫ్రాన్స్ కు వెళ్లిన ఓ వ్యక్తి కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం మరణించాడు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ ను ఏ దేశ సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకడానికి కేవలం 15సెకన్లు మాత్రమే పడుతుందని చైనా హెల్త్ అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి పక్క 15సెకన్లు వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు చెబుతున్నారు. తుమ్మినా, దగ్గినా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, బాధితుడి నోటి నుంచి వచ్చిన సూక్షజీవులు ఆరు మీటర్ల దూరం వరకూ వ్యాపిస్తాయని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ సమయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం చైనాలో జోరుగా సాగుతోంది. కరెన్సీ ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినప్పుడూ కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయం చైనావాసులను వెంటాడుతోంది. కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరెన్సీ నోట్లపై ఆంక్షలు విధించింది చైనా. కరెన్సీని తగ్గించి, ఇ-కామర్స్, నెట్ బ్యాంకింగ్‌లను వాడుకోవాలని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలకు సూచించింది. భారీ ఎత్తున నోట్లను సేకరించి, గొడౌన్లకు తరలిస్తున్నారు.
అలాగే, కరెన్సీని ఖాతాదారులకు అందజేసేటప్పుడు వైరస్ లేకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే సమయంలో కొరత లేకుండా చూడాలని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(PBC) ఆదేశాలు జారీచేసింది. వుహాన్ సహా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు పాత నోట్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేశారు .ఆన్‌లైన్ సేవలను మరింత వినియోగించుకోవాలని కోరింది ప్రభుత్వం. వీటితోపాటు 4బిలియన్ల యూన్ (527మిలియన్ డాలర్లు) కొత్త కరెన్సీ నోట్లను..వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన హుబే ప్రావిన్సుకు తరలించినట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వైస్ గవర్నర్ ఫాన్ ఈఫీఐ తెలిపారు.
వైరస్ ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లోని సరఫరా చేయడానికి ముందు పాత నోట్లను కనీసం 14 రోజుల పాటు అతినీలలోహిత కిరణాలు లేదా వేడిచేయడం ద్వారా శుభ్రం చేయనున్నట్టు పీబీసీ తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల మధ్య కరెన్సీ లావాదేవీలను నిలిపివేశారు. వుహాన్‌లోని హాస్పిటల్స్‌లోని రోగులకు సేవలు అందజేయడానికి రోబోలను రంగంలో దించారు. చైనాలోని అన్ని ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైగా వైద్యుల్ని హుబెయ్ ప్రావిన్సుకు పంపించారు.
వైరస్ ముఖ భాగాల నుంచి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చేతులతో ముఖాన్ని తాకవద్దని సింగపూర్ మంత్రి లారెన్స్ వాంగ్ ప్రజలకు సూచించారు. రెండు వారాల పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనల్ని నిషేధిస్తున్నట్టు హాంకాంగ్ కార్డినల్ ప్రకటించింది. చర్చిలకు వెళ్లేవారు ఆన్‌లైన్‌లో ప్రార్థనల్ని వీక్షించాలని తెలిపింది. ప్రార్థనా స్థలాలకు వచ్చేవారు కరచాలనం చేసుకోవద్దని ఫిలిప్పీన్స్‌లోని ఓ చర్చి ఆదేశాలు జారీ చేసింది.
Read More>>అక్రమ సంబంధంతో హత్య…14 ఏళ్ల జైలు జీవితం తర్వాత డాక్టరైన హంతకుడు