భారతీయుల్లా “నమస్తే” చెప్పండి, షేక్ హ్యాండ్ వద్దన్న ఇజ్రాయెల్ ప్రధాని

ప్రపంచదేశాలన్నింటికీ ఇప్పుడు కరోనా వైరస్(కోవిడ్-19) భయం పట్టుకుంది. వ్యాక్సిన్ లేని ఈ వైరస్  ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. 90వేల మంది ఈ వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

అయితే ఇదిలా ఉండగా వైరస్ తమ దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చికిత్స కన్నా నివారణ మేలన్న విధానాన్ని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి అవలంభిస్తున్నారు. ఇందులో భాగంగా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేశప్రజలకు సూచనలిచ్చారు. ఆయన తాజాగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి, వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియాముఖంగా మాట్లాడుతూ దేశ ప్రజలు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం మానుకోవాలని కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని కోరారు. రెండు చేతులను జోడించి నమస్కారం ఎలా పెట్టాలో కూడా చూపించారు. భారతీయ విధానంలోనే ఇతరులను పలకరించాలని, లేకపోతే షాలోమ్‌(హాయ్‌) చెప్పినా సరిపోతుందన్నారు. కానీ షేక్‌హ్యాండ్‌ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకండని పిలుపునిచ్చారు.

 ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 15 మంది కరోనా బారిన పడ్డారు. కాగా కరోనా మహమ్మారి సులువుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించి వెళ్లాలని, అలాగే వ్యక్తిగత శుభ్రతతోపాటు, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులలో 3.4శాతం మంది చనిపోయారని బుధవారం(మార్చి-4,2020)తన ప్రసంగంలో డబ్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ తెలిపారు.(కరోనా వైరస్‌లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి : WHO)