విజేత ఎవరో? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ..

స్వింగ్ స్టేట్స్ గా పేరొందిన ఏడు రాష్ట్రాలే విజేత ఎవరన్నది తేల్చ వచ్చని చెబుతున్నారు.

US Election 2024 (Photo Credit : Google)

US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 5 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో కమలా హారిస్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఎన్నికల ప్రచారంలో పదునైన మాటలతో ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో విజయమే లక్ష్యంగా ఇద్దరు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఇద్దరి మధ్య పోరాటం నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. స్వింగ్ స్టేట్స్ గా పేరొందిన ఏడు రాష్ట్రాలే విజేత ఎవరన్నది తేల్చ వచ్చని చెబుతున్నారు. ఇక్కడ తమ మద్దతుదారుల్లో ఎవరు ఎంత ఎక్కువ మందితో ఓటు వేయించగలిగితే అంత ఎక్కువగా వారికి విజయావకాశాలు ఉంటాయని ఎక్స్ పర్ట్స్ కూడా చెబుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న సర్వేలను చూస్తే.. ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా కనిపిస్తోంది. గత నెల రోజుల క్రితం కొంత ఎడ్జ్ లో ఉన్న కమలా హారిస్ కు ఆ తర్వాత ఓటర్ల నుంచి మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తోందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఓట్ల తేడా ఒక శాతమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. సీఎన్ఎన్ పోల్ లో ఈ వారంలో 47శాతం మంది ఓటర్లు హారిస్ కు సపోర్ట్ ఇవ్వగా, దాదాపుగా అంతేమంది ట్రంప్ ను సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇక ఎకానమీ విషయంలో మొదటి నుంచి ట్రంప్ విధానాలవైపే 47శాతం మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలను కమలా హారిస్ బాగా హ్యాండిల్ చేయగలరని 37శాతం మంది ఓటర్స్ భావిస్తున్నారు.

ఇక, వలసల విషయంలో అమెరికా ఓటర్లు ఎక్కువగా ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ తరుచూ ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో ఇమిగ్రేషన్ విధానంలో ట్రంప్ బెస్ట్ అని 48 శాతం మంది, కమలా బెటర్ అని 33 శాతం ఓటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వైట్ హౌస్ రేసులో గెలవాలంటే మొత్తం 531 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లను సాధించాలి. 7 కీలక స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, మిచిగాన్, అరిజోనా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్ సిన్, నెవెడా.. ఎన్నికల ఫలితాలను నిర్ణయించబోతున్నాయి. ఇక, నవంబర్ 5న జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకున్నప్పటికి.. ఎలక్టోరల్ కాలేజీని కోల్పోవచ్చు. ఇలా అమెరికా చరిత్రలో ఐదుసార్లు జరిగింది.

2016లో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓట్లతో వెనుకబడి ఉన్నప్పటికీ.. హిల్లరీ క్లింటన్ పై గెలిచి అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు ట్రంప్. 2024 ఎన్నికల్లో అమెరికన్ ప్రజలు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారు? తమ మద్దతు ట్రంప్ కా? కమలా హారిస్ కా? అనేది మరో 5 రోజుల్లో తేలిపోబోతోంది.

Also Read : ఉత్తర కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే?