Cuba Fuel Crisis: ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ఖతం.. 20 గంటలు కరెంట్ కోతలు..
ఓవైపు ఇంధన కొరత, మరోవైపు కరెంటు కోతలు.. దీంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- Naveen
- Updated on- May 14, 2026 / 08:41 PM IST
Cuba Fuel Crisis: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పలు దేశాలు పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆ దేశాల్లో ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే చాలా దేశాలు ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించాయి. పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకంలో కోతలు విధించాయి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కాగా, అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ పూర్తిగా అయిపోయింది. భారీగా కరెంటు కోతలూ మొదలైపోయాయి. దీంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
అమెరికా ఆంక్షలతో క్షిష్ట పరిస్థితులు..
క్యూబాలో డీజిల్, ఫ్యూయల్ ఆయిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి లెవీ తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెవీ మాట్లాడారు. పరిమిత పరిమాణంలో గ్యాస్ అందుబాటులో ఉన్నప్పటికీ, అమెరికా నేతృత్వంలో దేశానికి చమురు సరఫరాపై విధించిన దిగ్బంధం కారణంగా సరఫరా తగ్గిపోవడంతో క్యూబా ఇంధన వ్యవస్థ “క్లిష్టమైన” స్థితిలో ఉందని వాపోయారు. అంతేకాదు క్యూబాలో భారీగా కరెంట్ కోతలు విధిస్తున్నారు. ఏకంగా 20 గంటల పాటు పవర్ కట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాజధాని హవానాలో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా చెదురుమదురుగా నిరసనలు చెలరేగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
“క్యూబా కమ్యూనిస్ట్ వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు” తీసుకొచ్చినందుకు ప్రతిఫలంగా ఆ దేశానికి 100 మిలియన్ డాలర్ల సాయాన్ని పంపే ప్రతిపాదన చేసింది అమెరికా. ”వివిధ రకాల ఇంధనాలైన ముడి చమురు, ఫ్యూయల్ ఆయిల్, డీజిల్ ఇవేమీ మన దగ్గర లేవు. మన దగ్గర ఉన్న ఏకైక వస్తువు మన బావుల నుండి వచ్చే గ్యాస్ మాత్రమే, దాని ఉత్పత్తి పెరిగింది,” అని ఇంధన శాఖ మంత్రి లెవీ అన్నారు.
20 నుంచి 22 గంటలు విద్యుత్ కోతలు..
అమెరికా దిగ్బంధనం కారణంగా హవానాలోని కొన్ని ప్రాంతాలు 20 నుండి 22 గంటల పాటు విద్యుత్ కోతల్లో కూరుకుపోయాయని ఆయన వాపోయారు. దేశంలో పరిస్థితి “అత్యంత ఉద్రిక్తంగా” ఉందని ఆయన అంగీకరించారు. క్యూబాలో ఆసుపత్రులు సాధారణంగా పని చేయలేకపోతున్నాయి. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాల్సి వచ్చింది. క్యూబాకు ఆర్థిక చోదకశక్తి అయిన పర్యాటక రంగం కూడా ప్రభావితమైంది.
క్యూబా సాధారణంగా తన రిఫైనరీ వ్యవస్థకు చమురు సరఫరా కోసం వెనిజులా, మెక్సికోలపై ఆధారపడుతుంది. అయితే, క్యూబాకు ఇంధనాన్ని పంపే దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించినప్పటి నుండి ఈ రెండు దేశాలు సరఫరాలను చాలావరకు నిలిపివేశాయి. ఇంధన కొరతతో సతమతమవుతున్న తరుణంలో హవానాలో నిరసనలు చెలరేగాయి. వందలాది మంది క్యూబన్లు నగరవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, మండుతున్న చెత్తతో రోడ్లను దిగ్బంధించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. జనవరిలో క్యూబా ఇంధన సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి నగరంలో ఒకే రాత్రి జరిగిన అతిపెద్ద నిరసన ఇదే.
క్యూబాలో ఉద్రిక్త పరిస్థితులు నిజమేనని ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ డియాజ్ అంగీకిరంచారు. క్యూబాలో ఇంధన కొరతకు అమెరికానే కారణమని ఆరోపించారు. “ఈ ఉద్రిక్తలకు కారణం అమెరికానే. మనకు ఇంధనాన్ని సరఫరా చేసే ఏ దేశంపైనైనా సుంకాలను విధిస్తామని బెదిరిస్తూ, అమెరికా మన దేశంపై విధిస్తున్న జాతి నిర్మూలన ఇంధన దిగ్బంధనం” అని ఆయన ధ్వజమెత్తారు.
గత వారం 100 మిలియన్ డాలర్ల విలువైన అమెరికా మానవతా సహాయ ప్రతిపాదనను హవానా తిరస్కరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. అయితే, ఈ వాదనను క్యూబా ఖండించింది. మానవతా సాయాన్ని క్యాథలిక్ చర్చి, మానవతా సంస్థల సమన్వయంతో పంపిణీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. “మా సహాయ ప్రతిపాదనను అంగీకరించడమా లేక ప్రాణాలను కాపాడే ఈ కీలకమైన సాయాన్ని తిరస్కరించడమా అనే నిర్ణయం క్యూబా ప్రభుత్వానిదే. కీలకమైన సాయానికి అడ్డుపడినందుకు అంతిమంగా క్యూబా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి” అని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
“మానవ హక్కుల ఉల్లంఘనలకు” పాల్పడ్డారని ఆరోపిస్తూ క్యూబాపై ఆంక్షలు విధించింది అమెరికా. మే నెల ప్రారంభంలో వాషింగ్టన్ దిగ్బంధనం తీవ్రతరం అయింది. కాగా, ఈ ఆంక్షలు “చట్ట విరుద్ధమైనవి, దుర్వినియోగమైనవి” అని క్యూబన్ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ అభివర్ణించారు.
