మానవాళిపై ఇప్పటిదాకా ఎన్నో వైరస్‌లు దండయాత్ర చేశాయి. లక్షలాది మందిని బలితీసుకున్నాయి. అలాంటి సంక్లిష్ట సమయాల్లో చాలాసార్లు సైనికుల్లా ముందుకు కదిలాయి క్యూబా డాక్టర్ల బృందాలు. వైద్యసాయం వేడుకోవడమే ఆలస్యం.. ఆ దేశాల్లో వాలిపోయాయి. వైరస్ అంతుచూశాకే వెనుదిరిగాయి. ఇప్పుడు కరోనా విలయతాండవంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం క్యూబా తలుపు తడుతున్నాయి.
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటిదాకా 203 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్ సోకడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర సమయంలో అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. క్యాస్ట్రో దూరదృష్టితో చెప్పాడో.. తమ డాక్టర్ల క్యాలిబర్‌ను ముందే అంచనా వేసి చెప్పాడో తెలియదు. కానీ ప్రపంచంలో ఇప్పుడెక్కడ ఆపద వచ్చినా క్యూబా ఆయా దేశాల సహాయార్ధం డాక్టర్ల బృందాలను పంపించి సేవలందిస్తోంది.
క్యూబా-అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలు
క్యూబా సోషలిస్టు భావాలంటే అమెరికాకు నచ్చదు. అందుకే.. క్యూబా అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలుంటాయి. క్యూబాను అణగదొక్కేందుకు అమెరికా చెయ్యని
ప్రయత్నాల్లేవు. అంతేకాదు ఇటలీ, బ్రిటన్, జర్మనీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అవేవీ మనసులో పెట్టుకోని క్యూబా
కరోనా వైద్య సేవలందించేందుకు తన దేశం నుంచి వైద్య బృందాలను పంపింది. తమ దేశంలోకి క్యూబా వైద్యులు రాగానే ఇటలీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం
పలికారు.
సైనికుల్లా ముందుకెళ్లే డాక్టర్లు :
అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ లాంటి అనేక దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబా వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ
రోగాలు ప్రబలిన దేశాలను ఆదుకోవడంలో క్యూబా డాక్టర్లు సైనికుల్లా ముందుకు కదిలారు. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోతోంటే.. క్యూబా డాక్టర్ల బృందాలు పెద్ద
ఎత్తున అక్కడికి వెళ్లి సేవలందించాయి. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో
సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు.
వూహాన్‌కు డాక్టర్లతో పాటు మందులు పంపిన క్యూబా :
చైనాలోని వుహాన్‌లో కరోనా మహమ్మారి వెలుగుచూసిన వెంటనే.. అక్కడికి డాక్టర్లను పంపింది. తమ దేశంలో తయారైన కొన్ని మందుల్నీ పంపించింది. దీంతో చాలా మంది
రోగులకు వ్యాధి నయమైంది. వైద్య సాయం అర్థించిన వెంటనే ఇటలీకి నిపుణులైన డాక్టర్లను పంపి.. రోగుల ప్రాణాలే ముఖ్యమన్న క్యాస్ట్రో మాటల్ని తూచ తప్పకుండా
పాటించింది. ఇప్పుడు స్పెయిన్, నికరగవాకూ డాక్టర్లను పంపేందుకు సిద్ధమైంది. స్పాట్..
కరోనాకు బలైపోతున్న స్పెయిన్, ఇరాన్ :
కరోనా కల్లోలంతో అమెరికా కకావికలం అవుతోంది. ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్, ఇరాన్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయ్. ఈ దేశాలన్నీ సంపన్న
దేశాలు. ఆధునిక పోకడలు ఎక్కువగా ఉన్న దేశాలు. కానీ క్యూబా అమెరికాను ఆనుకుని ఉన్న చిన్న దేశం. అమెరికా విద్వేషాన్ని ఎదుర్కొంటూ తన దేశాన్ని
తీర్చిదిద్దుకున్న దేశం. ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశం. కరోనా విసిరిన సవాలును ధీటుగా స్వీకరించి వైద్యసేవలందిస్తున్న క్యూబా మన లాంటి దేశాల
ప్రాధాన్యతలు ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది. స్పాట్..
యుద్ధాలు శత్రుదేశాలతో కాదు వైరస్‌లతోనే.. :
ఆయుధాలు, అణ్వస్త్రాల కంటే విద్య, వైద్యం పైనే ఎక్కువ దృష్టిసారించింది క్యూబా. భవిష్యత్తులో యుద్ధాలంటూ చేయాల్సివస్తే అది శత్రుదేశాలతో కాదనీ.. కరోనా లాంటి
భయంకరమైన వైరస్‌లతోనే అన్న నిజాన్ని ఎప్పుడో గుర్తించింది. అందుకు వైద్యరంగాన్ని అత్యంత ప్రాధాన్యమైన రంగంగా గుర్తించింది. ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం
పోసే వైద్యాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేస్తోంది క్యూబా.