Nepal Protests: నేపాల్ లో మరోసారి కలకలం రేగింది. ఆందోళనలు చెలరేగాయి. జెన్-జడ్ నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు చోట్ల కర్ఫ్యూ విధించింది. ఎక్కువ మంది ఒక చోట చేరడంపై నిషేధం విధించింది. ఇటీవల నేపాల్‌లో జనరేషన్-జడ్ నిరసనలు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాపై బ్యాన్, ఇతర కారణాలతో నేపాల్ లో జనరేషన్ జడ్ నిరసనకారులు రగిలిపోయారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నిరసనల ధాటికి అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోయారు. అనంతరం నేపాల్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా మరోసారి జెన్ జడ్ నిరసనకారులు ఆందోళనకు దిగడం టెన్షన్ క్రియేట్ చేసింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు, యువ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సిపిఎన్-యుఎంఎల్) మద్దతుదారులు తిరిగి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జనరేషన్ జడ్ నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. బారా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బారా జిల్లాలో గ్యాథరింగ్స్ (ఎక్కువ మంది ఒక చోట చేరడం) పై నిషేధం విధించింది. శాంతి భద్రతల పరిరక్షన కోసం కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
బుధవారం బారా జిల్లాలోని సిమారా ప్రాంతంలో యువ నిరసనకారులు, సీపీఎన్-యూఎంఎల్ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చూస్తుండగానే రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఎయిర్ పోర్టుకి సమీపంలో ఘర్షణలు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించారు.
పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని నేపాల్ పోలీసులు తెలిపారు. తాజా ఉద్రికత్తలపై నేపాల్ ప్రధాని సుశీల కర్కి స్పందించారు. ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా రెచ్చగొట్టడం మానుకోవాలని అన్ని పొలిటికల్ పార్టీలకు ఆమె సూచించారు. వచ్చే మార్చి 5న జరిగే ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి నియమితులైన సంగతి తెలిసిందే.
మరోవైపు నిన్న 110 కి పైగా పార్టీల ప్రతినిధులతో సుశీల కర్కి సమావేశం నిర్వహించారు. ఈ దేశం కొత్త తరం చేతుల్లో ఉండాలని, దార్శనికత కలిగిన వ్యక్తులు పాలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 8, 9 తేదీలలో ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధం యువతలో ఆగ్రహానికి కారణమైంది. జనరల్ జెడ్ అనే పేరుతో నిరసనకారుల నాయకత్వంలో ఆందోళనలు జరిగాయి. ఇందులో హింస చెలరేగింది. కనీసం 76 మంది మరణించారు. సెప్టెంబర్ లో అప్పటి ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధం విధించడంతో నిరసనలు చెలరేగాయి. మరోవైపు ఆర్థిక స్తబ్దత, పాలకుల అవినీతితో విసిగిపోయిన యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు. అలా 3 కోట్ల మంది జనాభా కలిగిన దేశం తిరుగుబాటుకు దారితీసింది.
నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన 73 ఏళ్ల ఓలిని పదవీచ్యుతుని చేయడానికి ముందు పార్లమెంటు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టబడ్డాయి. హిమాలయ దేశాన్ని ఎన్నికల దిశగా నడిపించడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి కర్కి (73) తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.