Car Explodes In Islamabad
Islamabad blast: ఇండియా రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన మరవకముందే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇవాళ కారు బాంబు పేలి 12 మంది మృతి చెందారు. 27 మందికి గాయాలయ్యాయి. దీంతో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ “స్టేట్ ఆఫ్ వార్” ప్రకటించారు.
ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో ఇవాళ మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. దీంతో పాక్ భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేశాయి. ఇస్లామాబాద్ దాడిపై ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా బాధ్యత వహించలేదు.
ఇస్లామాబాద్‌లో పేలుడు ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఈ దాడికి అప్ఘానిస్థాన్ పాలకులే బాధ్యులని అన్నారు. ఇకపై యుద్ధం అఫ్ఘాన్-పాక్ సరిహద్దు ప్రాంతమైన దురాండ్ లైన్‌కు మాత్రమే పరిమితం కాబోదని, ఇది పెరుగుతుందని హెచ్చరించారు.
Also Read: Pawan Kalyan: “ఆ సమయం ఆసన్నమైంది” అంటూ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్
“ప్రస్తుత పరిస్థితుల్లో అప్ఘాన్ పాలకులతో చర్చలపై ఆశలు పెట్టుకోవడం వ్యర్థం” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. “మేము యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఈ యుద్ధం అఫ్ఘాన్-పాక్ సరిహద్దు ప్రాంతం, బలూచిస్థాన్‌కు దూర ప్రాంతాల్లో మాత్రమే జరుగుతోందని భావించే వారు.. నేటి ఆత్మాహుతి దాడిని మేల్కొలిపే చర్యగా తీసుకోవాలి. ఇది మొత్తం పాకిస్థాన్‌కు చెందిన యుద్ధం. ఇందులో పాకిస్థాన్ సైన్యం ప్రతిరోజూ త్యాగాలు చేస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తోంది” అని అన్నారు.
“అఫ్ఘాన్ పాలకులు పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ఆపగలరు. కానీ, ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు విస్తరించేలా చేస్తున్నారు. దానికి ప్రతిస్పందించే శక్తి పాకిస్థాన్‌కు ఉంది” అని ఆయన ఎక్స్ పోస్టులో రాశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఇస్లామాబాద్‌లో జరిగిన “ఆత్మాహుతి పేలుడు”ని ఖండించారు.