బంగారుగనిలో గోడ కూలి 30మంది మృతి

  • Publish Date - January 7, 2019 / 03:09 AM IST

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని  ఒక  బంగారు గనిలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. బదక్షన్‌ ప్రావిన్సులోని కోహిస్తాన్‌ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలోగోడ కూలి 30 మంది  కార్మికులు మరణించారు. మరో 7గురికి గాయాలయ్యాయి. ఇక్కడి గ్రామస్తులు నదీ తీరంలోని అనధికారిక బంగారు గనిలో తవ్వకాలు జరుపుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు కోహిస్తాన్ గవర్నర్ రుస్తమ్ రఫీ చెప్పారు. మరణించిన వారంతా  సాధారణ గ్రామస్తులని, నిపుణులైన కార్మికులుకాదని ఆయన తెలిపారు. ఈ గనులపై ప్రభుత్వ అజమాయిషీ లేదని దశాబ్దాల కాలంగా గ్రామస్తులు ఖనిజాలను తవ్వుతున్నారని ఆయన అన్నారు. 
నదీతీరంలోని ప్రాంతంలో 200 అడుగుల మేర గ్రామస్తులు బంగారం కోసం తవ్వకాలుజరిపారు. లోపలికి దిగి మరింత లోతుగా తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదవార్త తెలిసిన వెంటనే రక్షణ సహాయకచర్యలు చేపట్టామని, గాయపడిన వారిని రక్షణశాఖకు చెందిన హెలికాప్టర్ల ద్వారా  ఆసుపత్రులకు తరలించినట్లు రఫీ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో  తాలిబన్ ఉగ్రవాదులు ఆదాయంకోసం అక్రమ మైనింగ్ మీదనే ఆధార పడుతున్నారని, ఇక్కడ అక్రమ మైనింగ్ సర్వసాధారణమైన అంశమని వార్తా సంస్ధలు తెలిపాయి. ఈఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మరణించిన వారి కుటుంబాలకు 50వేల ఆఫ్గానీలు, గాయపడినవారి కుటుంబాలకు 10వేల ఆఫ్గానీలు అందిస్తామని రుస్తమ్ రఫీ  చెప్పారు.