China economy
China economy – Evergrande: చైనా ప్రస్తుతం మూడు నిబంధనలు పాటిస్తోంది. ఆ మూడు నిబంధనలే ఆ దేశం కొంపముంచేలా పరిణమించాయి.
1. ప్రతిద్రవ్యోల్బణంలోకి (Deflation) పడిపోయిన దేశ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడకూడదని చైనా నిబంధన పెట్టుకుంది. ప్రతిద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయి కంటే వస్తు, సేవల ధరలు పడిపోవడం. చైనాలో వినియోగదారుల ధరల సూచిక జులైలో 0.3 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
2. చైనాలో ఎంతమంది యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారన్న విషయాన్ని చెప్పడం లేదు. ప్రతి అయిదుగు యువతలో ఒకరికి ఉద్యోగం లేదని తెలుస్తోంది.
3. హౌసింగ్ సంక్షోభం గురించి సమాచారాన్ని దాచి పెడుతోంది. భూముల అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ తీరుతో అప్పుల ఊబిలో చైనా కూరుకుపోతోంది. బయటపడే దారే కనపడట్లేదు.
కొన్ని నిర్ణయాల వల్ల 1980లో నెలకొన్న పరిస్థితుల పర్యవసానంగా 1990ల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దశాబ్దం పాటు కోలుకోలేకపోయింది. ఆర్థిక రంగాన్ని చక్కదిద్దుకోవడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. 1990ల్లో జపాన్ ఎదుర్కొన్న ఆర్థిక దుస్థితినే చైనా ఇప్పుడు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
దాచి పెట్టే ధోరణి
ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన విషయాలను ప్రజలు తెలుసుకోకుండా చైనా ప్రభుత్వం దాచి పెడుతోంది. నిజానికి ప్రపంచంలోని అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆయా దేశాలు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణంపై పోరాడడానికి చర్యలు తీసుకుంటున్నాయి.
చైనా మాత్రం దీనికి విరుద్ధంగా చర్యలు తీసుకుంటోంది. అత్యవసరంగా ధరల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. చైనా తీసుకునే చర్యలు ఎప్పుడూ ఇలా వింతగానే ఉంటాయి. ఆ దేశ నేతల తీరును అర్థం చేసుకోవడం కష్టం. ఆర్థిక రంగం విషయంలో వాస్తవ పరిస్థితులను చెప్పదు.
ఆర్థిక రంగం గురించి చైనా బయటకు చెప్పే విషయాల కన్నా దాచిపెట్టే విషయాలే అధికం. 1998లో రియల్ ఎస్టేట్ రంగంలో చైనా ప్రభుత్వం పలు నిబంధనలను సవరించింది. ప్రభుత్వానికి చెందిన భూములను ప్రైవేటు డెవలపర్లకు లీజుకు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో దేశ వ్యాప్తంగా డెవలపర్లు భారీ భవంతులు నిర్మించారు. అయితే, అదే తడువుగా భారీ మొత్తంలో అప్పులు చేశారు. కాల క్రమేణా ఒకాకొక సమయంలో చైనా సగటు జాతీయ ఆదాయం కంటే 50 శాతం రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయాయి.
దిగ్గజ కంపెనీలు దివాళా
అప్పుల విషయంలో చైనా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీంతో ప్రైవేటు డెవలపర్లు దివాళా తీశారు. చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎవర్‌గ్రాండే (Evergrande) గ్రూప్ 2021లో 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా తిరిగి చెల్లించలేని స్థితిలోకి వెళ్లిపోయింది. కంట్రీ గార్డెన్ (Country Garden) కంపెనీ కూడా 16 లక్షల కోట్లకు పైగా డిఫాల్ట్ అయింది. ఇళ్ల ధరలు వేగంగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు పెట్టిన పెట్టుబడులు ఆవిరైపోతున్నాయి. వారిలో భయం మొదలైంది.
టెక్ రంగంలో ఇంతలా జోక్యమా?
మరోవైపు, టెక్ రంగంలో చైనా పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా అనేక నిబంధనలు పెట్టింది. దీంతో కొన్నేళ్ల క్రితం టెక్ రంగంలో నెలకొన్న పరిణామాలపై చైనా సర్కారుపై యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా చేసిన విమర్శలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
టెక్ కంపెనీలు ఎన్ని ఉన్నా అన్నింటిపైనా తమదే ఆధిపత్యం ఉండాలన్న తీరుతో చైనా సర్కారు వ్యవహరించింది. వీడియో గేమ్స్, ఎడ్‌టెక్, ఈ-కామర్స్ సహా అన్నింటిపైనా పెత్తనం చెలాయించేలా నిర్ణయాలు తీసుకుంది. టెక్ స్టార్టప్‌లలో వేలాది ఉద్యోగాలు ఊడిపోయాయి. యువతలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది.
తమకే తెలివి ఉన్నట్లు జీరో కొవిడ్ విధానం
దీనికి తోడు చైనాలో కరోనా సమయంలో ఆ ప్రభుత్వం పాటించిన జీరో కొవిడ్ విధానం మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు అయింది. లాక్‌డౌన్లు, ఐసొలేషన్లు, అతి భారీగా టెస్టులు చేడం వంటివి కొనసాగాయి. బడులు, కార్యాలయాలు, పార్కులు అన్నింటిపైనా దీని ప్రభావం పడింది. ఆర్థిక రంగాన్ని ఇప్పట్లో కోలుకోలేని దెబ్బతీసింది.
చైనాలోని స్థానిక ప్రభుత్వాలు చేసిన అప్పులకు తోడు హౌసింగ్ మార్కెట్ చాలెంజ్ లను చైనా సమర్థంగా ఎదుర్కోలేని స్థితికి వెళ్లిపోయింది. చైనాలో ధరలు పడిపోతుండడంతో ఆ దేశ వృద్ధి రేటు నత్తనడకన కొనసాగుతోంది. ఇక అప్పులు ఎలా తీరతాయన్న ప్రశ్న నెలకొంది. ధరలు పడిపోవడం అనేది అన్ని వేళలా ఆర్థిక రంగానికి మంచిది కాదు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని రోజులు ఆగి వస్తువులను కొంటే బాగుంటుందని భావిస్తారు. కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి.
Mushaal Hussein Mullick: పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి