ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఊళ్లకు ఊళ్లే తగలబడిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 25 మంది చనిపోయారని చెబుతున్నప్పటికీ అనధికారికంగా ఆ సంఖ్య చాలానే ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా కార్చిచ్చును అంతరిక్షం నుంచి చూస్తే ఓ అగ్నిగోళంలా కన్పిస్తోంది.
అసలు ఇంతకీ ఈ విపత్తుకి కారణం ఎవ్వరు?
ఇప్పటికే బుష్ ఫైర్ (కార్చిచ్చు) ను రగలించారన్న ఆరోపణలతో వందల మందిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ సౌత్ వేల్స్ లో 183 మంది బుష్ ఫైర్ కి పాల్పడినట్లు తెలుస్తుంది. అందులో 24 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా చెప్పింది. విక్టోరియాలో 43 మంది పై కేసులు పెట్టారు. పొరుగునున్న క్వీన్స్ లాండ్ లో 101 మందిని అరెస్టు చేశారు. వీరిలో 70 శాతం మంది కుర్రాళ్లే. వీళ్ల ఆకతాయి పనులవల్ల స్థానికంగా కార్చిచ్చు రగులుకుందని పోలీసులు అంటున్నారు. వీళ్లలో సగం మందికి మంటలాటలంటే ఇష్టమంట. మంటలు ఎలా వ్యాపిస్తాయో, వాటిని చూటడం, ఆర్పటం వంటి విషయాలపై వీళ్లకు ఆసక్తి ఉంది. వీళ్లంతా ఫైర్ ఫైటర్స్ కావాలనుకున్నారు. అందుకే వాళ్లే అడవులను తగలబెట్టారన్నది మరో అంచాన.
మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జానెట్ స్టాన్లీ తెలిపిన వివరాల ప్రకారం… కార్చిచ్చు రగిలించిన వారిలో 12 నుంచి 24 ఏళ్ల యువకులు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లున్నారు. చిన్నతనంలో వారు పెరిగిన పరిస్ధితుల ప్రభావం వల్ల బుష్ ఫైర్ చేసి ఉండవచ్చు అని ఆమె అంటున్నారు.
ఆస్ట్రేలియాలో 25.5 మిలియన్ ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేసిన తర్వాత విక్టోరియా, సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ లో 700 మిలియన్ డాలర్ల(రూ.3,473 కోట్లు) నష్టం వచ్చినట్లు బీమా సంస్ధలు అంచనావేశాయి.