అమెరికా – చైనా మ‌ధ్య మ‌రింత ముదిరిన టారిఫ్ వార్‌.. చైనాకు మరో బిగ్ షాకిచ్చిన ట్రంప్..

అమెరికా, చైనా టారిఫ్ వార్ పతాకస్థాయికి చేరింది. అమెరికాకు చైనా దిగుమతులపై 245% వరకు సుంకాలు విధిస్తూ..

US-China Trade War

US-China Trade War: అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ పతాకస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ప్రతీకార సుంకాల యుద్ధానికి చైనా సైఅంటే సైఅంటూ కాలుదువ్వుతోంది. చైనా దిగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాలను పెంచుతుండగా.. చైనా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలను పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా దిగుమతులపై 245శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ధ్రువీకరించింది.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్, చైనాసహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించింది. అయితే, యూఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కొన్ని దేశాలు సిద్ధమయ్యాయి. దీంతో చైనా మినహా మిగిలిన దేశాలకు టారిఫ్ ల నుంచి 90రోజులపాటు ట్రంప్ విరామం కల్పించారు. చైనాపై మాత్రం ట్రంప్ ప్రతీకార సుంకాలను పెంచారు. ఇరు దేశాలు పోటాపోటీగా ప్రతీకార సంకాలను పెంచుకుంటూ వెళ్లారు. అలా చైనా వస్తువులపై ట్రంప్ 145శాతం సుంకం విధించగా.. డ్రాగన్ కూడా అగ్రరాజ్యం వస్తువులపై 125శాతం సుంకాలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ తీవ్రరూపం దాల్చింది.

 

ఈ క్రమంలోనే తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను యూఎస్ కు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లు చైనా ప్రకటించింది. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కారణం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70శాతం వాటా చైనాదే కావటం గమనార్హం. అమెరికా వాటా 11.4శాతమే ఉంది. అంతేకాక.. అమెరికా వైమానిక రంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఎటువంటి డెలివరీలు స్వీకరించవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను చైనా ఆదేశించినట్లు బ్లూమ్ బెర్గ్ కథనంలో వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చైనా వస్తువులపై 145శాతం సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా మరో 100శాతం పెంచి 245శాతానికి తీసుకెళ్లారు.