USA Visa Rules: ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు..ఇకపై నాలుగేళ్లే!
'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్(USA Visa Rules)' కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే విధిస్తారు.
- V Santhosh Kumar
- Published on- July 16, 2026 / 09:16 PM IST
Donald Trump administration set to make major changes to F-1 visa rules
- అమెరికా వీసా నిబంధనల మార్పు
- విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితి విధింపు
- భారతీయ విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన
USA Visa Rules: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న కీలక వలస నిబంధనను మార్చేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. వీసా వ్యవస్థపై పర్యవేక్షణ పెంచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
నాలుగేళ్ల కాలపరిమితి: కోర్సు పూర్తి కాకపోతే కష్టమే:
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ ప్రకారం F-1 వీసా (USA Visa Rules)విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో చట్టబద్ధంగా ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే విధిస్తారు. ఈ లోపు చదువు పూర్తికాకపోతే అదనపు గడువు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు F-1 విద్యార్థులతో పాటు J-1 ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధుల ‘I’ వీసాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పరిశోధనలు, పీహెచ్‌డీ, మెడికల్ కోర్సులు చేసేవారికి ఈ పరిమితి పెద్ద చిక్కుగా మారనుంది.
భారతీయ విద్యార్థుల్లో ఆందోళన:
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3.31 లక్షల మందితో భారతీయులే అతిపెద్ద విద్యార్థి వర్గంగా ఉన్నారు. కొత్త రూల్ అమల్లోకి వస్తే గడువు పొడిగింపు దరఖాస్తుల ప్రక్రియలో జరిగే అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యం వల్ల భారతీయ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదన వెంటనే అమలు కాదు. దీనికి ముందుగా అమెరికన్ కాంగ్రెస్ సమీక్ష, ఆమోదం తప్పనిసరి. అధికారిక తేదీ ప్రకటించే వరకు ప్రస్తుత పాత విధానమే కొనసాగినప్పటికీ, భవిష్యత్తుపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
