US Tariffs
US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చైనాపై మళ్లీ కోపం వచ్చింది. ఇంకేముంది ఎడాపెడా టారిఫ్‌ల మోత మోగించాడు. చైనా దిగుమతులపై అదనంగా ఏకంగా 100శాతం టారిఫ్‌లు విధించేశాడు. ఈ టారిఫ్‌లు వచ్చేనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. అయితే, ఇప్పటికే చైనాపై 30శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
మరో రెండు వారాల్లో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటువంటి తరుణంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించడం లేదని, భేటీని రద్దు చేసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు.
Also Read: Tennessee: అమెరికాలో భారీ పేలుడు.. 19మంది మృతి.. మరికొందరికి గాయాలు.. అసలేం జరిగిందంటే?
చైనా నిర్ణయానికి ప్రతిచర్యగా ఆ దేశ ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని ట్రంప్ అన్నారు. ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిగంటల్లోనే చైనా దిగుమతులపై 100శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పిన ట్రంప్.. తాజా పరిణామాలపై చైనా ఏమైనా దూకుడుగా ముందుకెళ్తే సుంకాల మోత ఈనెలలోనే ప్రారంభమవుతుందని ట్రంప్ అన్నారు.
చైనాపై 100శాతం టారిఫ్‌లు అనంతరం ట్రంప్ తన సోషల్ ట్రూత్ లో పోస్టు పెట్టారు. ‘‘చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. చైనా నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. వారు సంవత్సరాల క్రితం రూపొందించిన ప్రణాళిక ఇది. అందరికీ శత్రువులుగా మారుతున్నారు. చైనాతో తాము కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ… వారి చర్యలు తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడానికి కారణాలు కనిపించడం లేదు. ఆ దేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలని నిర్ణయించాం. చైనా ఉత్పత్తులపై 100శాతం సుంకాన్ని విధిస్తున్నాం. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి. అన్ని కీలకమైన సాప్ట్ వేర్ లపై ఎగుమతి నియంత్రణలను విధిస్తాం.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా, చైనా దేశాల మధ్య మళ్లీ టారిఫ్ వార్ మొదలు కావడంతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే, ట్రంప్ 100శాతం టారిఫ్‌లపై చైనా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ట్రంప్ తాజా నిర్ణయంతో అరుదైన ఖనిజాలపై ఆంక్షలను చైనా విరమించుకుంటుందా.. లేదంటే అమెరికాకు షాకిచ్చే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.