Donald Trump: ఏప్రిల్ 2 నుంచి ఇండియాపై సుంకాలు.. ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు.

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేస్తున్న సంస్కరణలపై వివరించారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని, మరో 400 క్యానిర్వాహక చర్యలు చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు.

 

బిడెన్ ప్రభుత్వ విధానాలను రద్దు చేయడం గురించి ట్రంప్ మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలు దేశానికి ప్రయోజనకరం కాదని అన్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో చేయలేని పనిని తమ ప్రభుత్వం 43 రోజుల్లోనే చేసి చూపించిందని పేర్కొన్నారు. ట్రంప్ ఆయా దేశాలపై సుంకాలు విధించే అంశంపైనా కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో మాట్లాడారు. ఈ క్రమంలో భారత్ పేరును పలుసార్లు ట్రంప్ ప్రస్తావించారు.

 

దశాబ్దాలుగా ఇతర దేశాలు మనపై సుంకాలను విధిస్తున్నాయన్న ట్రంప్.. అదే తరహాలో ఆ దేశాలపైనా ప్రతీకార సుంకాన్ని విధించడం బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికాపై సుంకాలు విధించే దేశాల జాబితాను విడుదల చేశారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం, మెక్సికో, కెనడా దేశాలు చాలా ఎక్కువగా సుంకాలు విధిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో రెండు సార్లు భారతదేశం పేరును ట్రంప్ ప్రస్తావించారు. భారత దేశం మనపై 100శాతానికిపైగా ఆటో టారిఫ్ లు విధిస్తుందని ట్రంప్ తెలిపారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై చైనా సగటు సుంకం అమెరికా కంటే ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువ. ఇంకా దక్షిణ కొరియాకు సైనికపరంగా, అనేక ఇతర విధాలుగా చాలా సహాయం అందిస్తున్నామని ట్రంప్ అన్నారు.

 

మన స్నేహితులు, శత్రువులు ఇద్దరూ ఇలానే చేస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని ట్రంప్ తెలిపారు. కెనడా, మెక్సికో, భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. వాళ్లు ఎంత పన్నులు విధిస్తే మేము కూడా అంతే మొత్తంలో పన్నులు విధిస్తాం. తద్వారా అమెరికా మరింత సంపన్నంగా మారుతుందని ట్రంప్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయాలని తొలుత భావించామని, అయితే, ఏప్రిల్ పూల్ అనే మీమ్స్ బారిన పడలేను అంటూ ట్రంప్ వెల్లడించారు.