యాపిల్ కి ట్రంప్ టారిఫ్ ధమ్కీ.. అమెరికాలో కాకుండా బయట దేశాల్లో ఫోన్లు తయారు చేశావో..

భారత్‌లో యాపిల్‌ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదన్నాడు.

Donald Trump: యాపిల్ సంస్థ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఐఫోన్ల తయారీకి సంబంధించి మరోసారి యాపిల్ సంస్థకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను స్థానికంగానే తయారు చేయాలని తేల్చి చెప్పాడు. ఇండియా లేదా మరే దేశంలో తయారు చేయొద్దని స్పష్టం చేశాడు. తన మాట కాదని భారత్ లో లేదా మరో దేశంలో ఐఫోన్లు తయారు చేస్తే కనీసం 25శాతం టారిఫ్ (సుంకం) ఎదుర్కోవాల్సిందేనని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను హెచ్చరించాడు ట్రంప్.

”అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యూఎస్ లోనే తయారు చేయాలి. భారత్‌ లేదా మరో దేశంలో కాదు అని టిమ్‌ కుక్‌కు ఇప్పటికే తెలిపా. అలా కుదరదు అంటే.. కనీసం 25శాతం సుంకాన్ని అమెరికాకు యాపిల్‌ చెల్లించాల్సిందే’’ అని ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టాడు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే యాపిల్‌ షేర్ పై ఎఫెక్ట్ పడింది. దాని షేర్ విలువ 3శాతం పతనమైంది.

చైనాపై అమెరికా టారిఫ్ లతో యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐఫోన్ల తయారీని ఇండియాలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ప్రక్రియపై ఇటీవల స్పందించిన ట్రంప్‌.. దాన్ని నిలిపివేయాలని యాపిల్‌కు సూచించాడు. భారత్‌లో యాపిల్‌ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదన్నాడు. ఇదే విషయంపై మళ్లీ స్పందించిన ట్రంప్.. అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక తప్పదంటూ యాపిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

Also Read: పాక్‌ను లేపేశారు, కొత్త పేరు పెట్టారు.. మైసూర్ పాక్ పేరు మారుస్తూ స్వీట్ షాప్ ఓనర్ల కీలక నిర్ణయం..

”నిన్న టిమ్ కుక్ తో నాకు చిన్న సమస్య ఎదురైంది”. ఆయన భారతదేశం అంతటా నిర్మాణాలు చేస్తున్నారు. మీరు భారత్ లో నిర్మాణాలు చేపట్టడం నాకు ఇష్టం లేదు” అని ట్రంప్ అన్నాడు. ట్రంప్ తాజా హెచ్చరికతో.. వచ్చే ఏడాది చివరి నాటికి భారత్ నుండి తన యుఎస్ ఐఫోన్ సరఫరాలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేయాలనే ఆపిల్ ప్రణాళికను దెబ్బతీశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాపిల్ తన ఐఫోన్లను ఎక్కువగా చైనాలో తయారు చేస్తుంది. అమెరికాలో ఉత్పత్తి లేనే లేదు.

భారత్ లో తయారైన ఐఫోన్లలో ఎక్కువ భాగం దక్షిణ భారత్ లోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేయబడతాయి. టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగం కూడా కీలక సరఫరాదారు. టాటా, ఫాక్స్‌కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

మార్చి వరకు 12 నెలల్లో ఆపిల్ భారత్ లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది. దీని వలన ఉత్పత్తి గత సంవత్సరం కంటే దాదాపు 60% పెరిగింది.