Mysore Pak Name Changed: పాక్‌ను లేపేశారు, కొత్త పేరు పెట్టారు.. మైసూర్ పాక్ పేరు మారుస్తూ స్వీట్ షాప్ ఓనర్ల కీలక నిర్ణయం..

మా షాపులో విక్రయించే స్వీట్లు అన్నింటిలో పాక్ అనే పేరుని తొలగించాము. అందుకు బదులుగా..

Mysore Pak Name Changed: పాక్‌ను లేపేశారు, కొత్త పేరు పెట్టారు.. మైసూర్ పాక్ పేరు మారుస్తూ స్వీట్ షాప్ ఓనర్ల కీలక నిర్ణయం..

Updated On : May 23, 2025 / 9:41 PM IST

Mysore Pak Name Changed: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో రగిలిపోయిన పాకిస్తాన్.. భారత్ పై దాడులకు తెగబడింది. మన పౌరులు లక్ష్యంగా కాల్పులు జరిపింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్తాన్ జైపూర్ లోని స్వీట్ షాప్ ఓనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ స్వీట్ల పేర్లు మార్చేశారు. అందులో ఒకటి మైసూర్ పాక్. ఈ స్వీట్ పేరులో పాక్ అనే పదం ఉంది. ఇది వారికి నచ్చలేదు. దీంతో మైసూర్ పాక్ పేరుని మైసూర్ శ్రీగా మార్చేశారు.

దీనిపై స్థానిక స్వీట్ షాప్ యజమాని ఒకరు స్పందించారు. మా షాపులో విక్రయించే స్వీట్లలో పాక్ అనే పేరుని తొలగించాము. బదులుగా శ్రీ అనే పదాన్ని జోడించాము అని వివరించారు. ”మా స్వీట్ల పేర్ల నుండి ‘పాక్’ అనే పదాన్ని తొలగించాము. ‘మోతీ పాక్’ ను ‘మోతీ శ్రీ’ గా, ‘గోండ్ పాక్’ ను ‘గోండ్ శ్రీ’ గా, ‘మైసూర్ పాక్’ ను ‘మైసూర్ శ్రీ’ గా మార్చాము” అని ఒక దుకాణదారుడు తెలిపారు.

అయితే, స్వీట్స్‌లో ‘పాక్’ అనే పదం పాకిస్తాన్‌ను సూచించదు, కానీ కన్నడలో తీపి అని అర్థం. కర్ణాటకలోని మైసూర్ (ఇప్పుడు మైసూరు) నుంచి వచ్చే పాల పొడితో ఈ స్వీట్ చేస్తారు. ఇక పాక్ అనేది రెసిపీలో ఉపయోగించే చక్కెర సిరప్‌ను సూచిస్తుంది. అలా ఈ స్వీట్ కి మైసూర్ పాక్ అనే పేరు వచ్చింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్వీట్ల పేర్ల మార్పు అంశంపై ఓనర్లు స్పందించారు. ”దేశభక్తి స్ఫూర్తి కేవలం సరిహద్దుల్లోనే కాకుండా ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. అందుకే మా స్వీట్ల పేర్ల నుండి ‘పాక్’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో సాంస్కృతికంగా ప్రతిధ్వనించే, దేశభక్తితో కూడిన ప్రత్యామ్నాయాలను తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాము” అని స్వీట్ షాప్ ఓనర్లు తెలిపారు.

Also Read: సలాం రాజ్ భాయ్‌.. పానీపూరి అమ్ముతూ… రాత్రి చదువుకుంటూ… ఇస్రోలో చేరాలన్న కలను నెరవేర్చుకుని… వారెవ్వా

మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్, మైసూర్ పాక్ వంటి పేర్లు ఇప్పుడు మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ, మైసూర్ శ్రీ లుగా మారాయి. స్వర్ణ్ భస్మ్ పాక్, చండి భస్మ్ పాక్ పేర్లు స్వర్ణ్ శ్రీ, చండి శ్రీ గా మార్చబడ్డాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత, ఏ సందర్భంలోనైనా ‘పాక్’ అనే పదం ఉండటం పట్ల చాలామంది అసౌకర్యాన్ని వ్యక్తం చేశారని, అందుకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకోబడిందని వివరించారు. ఈ మార్పు చేయాలని కస్టమర్లు స్వయంగా మమ్మల్ని కోరారని స్వీట్ షాప్ ల ఓనర్లు వెల్లడించారు. ఈ పాక్ రీబ్రాండింగ్ చర్యను జైపూర్ అంతటా అనేక ఇతర స్వీట్ షాపుల అనుసరించాయి.

సంస్కృతం నుండి ఉద్భవించిన “వంట” అనే అర్థం వచ్చే “పాక్” అనే పదం చాలా కాలంగా భారతదేశ వంటకాల నామకరణంలో భాగంగా ఉంది. అయితే పాక్ బదులుగా కొత్త పేర్లు గర్వాన్ని కలిగించడం మాత్రమే కాకుండా సంతృప్తిని కూడా కలిగిస్తాయన్నారు.

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. క్షిపణుల వర్షం కురిపించింది. ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులతో రగిలిపోయిన పాకిస్తాన్.. భారత పౌరులు లక్ష్యంగా డ్రోన్ దాడులకు తెగబడింది. భారత ఆర్మీ పాక్ డ్రోన్ దాడులను తిప్పికొట్టింది. అంతేకాదు పాక్ లోని ఎయిర్ ఫీల్డ్స్ పై దాడులు చేసింది. భారీ నష్టం కలిగించింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.