సలాం రాజ్ భాయ్‌.. పానీపూరి అమ్ముతూ… రాత్రి చదువుకుంటూ… ఇస్రోలో చేరాలన్న కలను నెరవేర్చుకుని… వారెవ్వా

పానీపూరి అమ్మే స్థాయి నుంచి ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.

సలాం రాజ్ భాయ్‌.. పానీపూరి అమ్ముతూ… రాత్రి చదువుకుంటూ… ఇస్రోలో చేరాలన్న కలను నెరవేర్చుకుని… వారెవ్వా

Updated On : May 23, 2025 / 5:37 PM IST

Golgappa Seller to ISRO Employee: ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో శ్రమించాలి. ఇతర పనులు, ఆటపాటలు అన్నింటినీ పక్కనపెట్టేసి పుస్తకం పట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇస్రోలో చేరే కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. అయితే, పట్టుదల ఉంటే పని చేసుకుంటూ చదువుకుని కూడా ఇస్రోలో జాబ్ తెచ్చుకోవచ్చని నిరూపించాడు ఓ యువకుడు.

మహారాష్ట్రలోని గోండియా జిల్లా తిరోరా తాలూకా ఖైరబోడి గ్రామం నందన్ నగర్‌కు చెందిన రామ్‌దాస్ హేమ్‌రాజ్ మార్బాడే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో శ్రమించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో టెక్నీషియన్ ఉద్యోగం సాధించారు. పగలు పల్లెల్లో చక్రాలబండిపై పానీపూరి (గోల్‌గప్పా) అమ్ముతూ, రాత్రుళ్లు చదువుకుంటూ శ్రమించి ఈ ఘనతను దక్కించుకున్నారు.

పగలు పానీపూరి, రాత్రి చదువు

రామ్‌దాస్ తండ్రి భండారా జిల్లా, డోంగార్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి గృహిణి. రామ్‌దాస్ ప్రాథమిక విద్య గుమాధవాడాలోని గణేశ్ హైస్కూల్లో సాగింది. ఇంటర్ తిరోరాలోని  సీజీ పటేల్ కాలేజ్‌లో పూర్తిచేశారు. ఆర్థిక ఇబ్బందులతో నాసిక్‌లోని యశవంతరావ్ చవ్హాన్ ఓపెన్ యూనివర్సిటీ ప్రైవేట్‌గా బీఏ డిగ్రీ చదివారు. కుటుంబ పోషణకు, చదువు ఖర్చులకు గోల్‌గప్పాలు అమ్మేవారు.

(చదవండిఎస్బీఐలో ఉద్యోగాలు.. 2వేల 964 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. )

ISRO కలే లక్ష్యంగా…

సాధారణ కుటుంబం అయినా, ISROలో పనిచేయాలనే లక్ష్యంతో రామ్‌దాస్ తిరోరా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI)లో చేరారు. అక్కడ పంప్ ఆపరేటర్-కమ్-మెకానిక్ కోర్సు పూర్తిచేశారు. పంపులు, ఫ్లూయిడ్ ఫ్లో, ప్రెషర్, హెడ్, కవిటేషన్, వాటర్ ట్రీట్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్ మెయింటెనెన్స్ లాంటి సాంకేతిక విషయాలపై అవగాహన పెంచుకున్నారు.

కఠోర శ్రమ… ISRO అవకాశం

ISRO 2023లో అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల ప్రకటనను ఇచ్చింది. రామ్‌దాస్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 2024లో నాగ్‌పూర్‌లో రాతపరీక్షలో అర్హత సాధించారు. 2024 ఆగస్టు 29న శ్రీహరికోటలో జరిగిన స్కిల్ టెస్టులోనూ పాసై, చివరకు ISRO ఉద్యోగానికి అర్హత సాధించారు.

(చదవండిబంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిందే.. )

ISROలో బాధ్యతలు

రామ్‌దాస్‌కి 2025 మే 19న జాయినింగ్ లెటర్‌ అందింది. రామ్‌దాస్ శ్రీహరికోట ISRO స్పేస్ సెంటర్‌లో పంప్ ఆపరేటర్-కమ్-మెకానిక్ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం మైక్రో రిసెర్చ్ విభాగంలో తన బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు.

రామ్‌దాస్ విజయంతో కుటుంబ సభ్యులు, గోండియా జిల్లా ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు, గర్వపడుతున్నారు. పానీపూరి అమ్మే స్థాయి నుంచి ISRO టెక్నీషియన్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.