Gold Loan: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిందే..
అంత కన్నా తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారానికి రుణం మంజూరు కాదు.

దేశంలో బంగారు రుణాల సిస్టమ్‌లో పారదర్శకత పెంచేలా, వినియోగదారులకు మేలు చేకూరేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక మార్పులు ప్రతిపాదించింది. బ్యాంకులు, NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) జారీచేసే బంగారం, వెండి రుణాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. గురువారం ఈ ముసాయిదా మార్గదర్శకాలు వెలువడ్డాయి.
♥ LTV 75%కి పరిమితం: బంగారు రుణాలకు రుణ విలువ నిష్పత్తి (LTV) ఇప్పుడు గరిష్ఠంగా 75%. కొవిడ్ సమయంలో ఇది 80 శాతానికి పెరిగినా, మళ్లీ 75 శాతానికి తగ్గించారు. బులెట్ రిపేమెంట్ రుణాలకు అసలు, వడ్డీ కలిపి లెండింగ్ విలువ లెక్కిస్తారు.
♥ బంగారం మీదేనన్న రుజువు ఉండాలి: బంగారానికి సంబంధించిన రశీదు లేకుంటే అప్పు తీసుకునేవారు సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. దానిలో అనుమానం వస్తే రుణం ఇవ్వకూడదు.
♥ బంగారం వివరాల సర్టిఫికెట్: అప్పు తీసుకునేవారికి బంగారం బరువు, స్వచ్ఛత, మినహాయింపులు, ఫొటోలతో కూడిన పూర్తి వివరాల సర్టిఫికెట్ అందించాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది.
♥ ఏ బంగారం ఓకే?: 22 క్యారెట్ల కన్నా తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారానికి రుణం మంజూరు కాదు. అయితే, బ్యాంకులు అమ్మే ఇండియా గోల్డ్ కాయిన్స్‌ను మాత్రం స్వీకరిస్తారు.
♥ వెండి రుణాలకు గ్రీన్ సిగ్నల్: తొలిసారిగా వెండి రుణాలకు అనుమతి వచ్చింది. అయితే, 925 స్వచ్ఛత ఉన్న ప్రత్యేక వెండి నాణేలపై మాత్రమే ఈ అవకాశం.
♥ బరువుపై పరిమితులు: ఒకే రుణంలో గరిష్ఠంగా 1 కిలో బంగారు ఆభరణాలు, 50 గ్రాముల బంగారు నాణేలు మాత్రమే తీసుకుంటారు.
♥ విలువ లెక్కింపు ఇలా: బంగారం విలువను 22 క్యారెట్ల ధర ప్రకారమే లెక్కిస్తారు. తక్కువ క్యారెట్ బంగారం అయినా, 22 క్యారెట్ల రేటునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది రేట్ల స్థిరత్వానికి తోడ్పడుతుంది.
♥ స్పష్టమైన రుణ ఒప్పందం: రుణ ఒప్పంద పత్రాల్లో అన్ని ఛార్జీలు, బంగారం వివరాలు, వేలం ప్రక్రియ, చెల్లింపు గడువులు స్పష్టంగా పేర్కొనాలి.
(చదవండి: సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే కేవలం వడ్డీనే రూ. 12 లక్షలు సంపాదించవచ్చు! )
♥ బంగారం వాపసు త్వరగా: రుణం పూర్తిగా చెల్లించాక, 7 పనిదినాల్లోపు బంగారం తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే రోజుకు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ఈ మార్పులు.. బ్యాంకులు, NBFCలు ఇచ్చే బంగారు రుణాల ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. అందరి అభిప్రాయాలు స్వీకరించాక తుది నిబంధనలు వెలువడతాయి.