Elon Musk and Vivek Ramaswamy
Elon Musk, Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. తన విజయంలో కీలక భూమిక పోషించిన వారికి ట్రంప్ కీలక పదవులు అప్పగిస్తున్నారు. తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎలాన్ మస్క్ కు ట్రంప్ కీలక పదవి అప్పగించారు.
Also Read: Tom Homan: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. టామ్ హోమన్‌కు ‘బార్డర్ జార్’గా బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కీలక పదవుల్లో నియమించగా.. తాజాగా.. ఎఫిషీయెన్సీ శాఖకు ఎలాన్ మస్క్ ను హెడ్ గా ట్రంప్ నియమించారు. ఆయనతోపాటు వివేక్ రామస్వామి కూడా హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ‘ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునిర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా -2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకుడు, రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఇటీవల ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ కు మొదటి నుంచి మస్క్ అన్ని విధాల సహకారం అందిస్తూ వచ్చారు. భారీగా మొత్తంలో విరాళాలు అందించడంతోపాటు.. ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తరువాత మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు 2024లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ట్రంప్ పై వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ట్రంప్ కు మద్దతు పలుకుతూ రేసు నుంచి రామస్వామి తప్పుకున్నాడు. ఆ తరువాత ట్రంప్ విజయంలో తన వంతు కీలక భూమిక పోషించాడు.
అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) సెక్రటరీగా సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్ ను ట్రంప్ నియమించారు. దేశ సరిహద్దు భద్రత విషయంలో ఆమె ‘బోర్డర్ జార్’ టామ్ హోమన్ తో కలిసి పనిచేయనుంది. అదేవిధంగా రక్షణ శాఖ కార్యదర్శిగా హోస్ట్ పీట్ హెగ్‌సేత్‌ను ట్రంప్ నామినేట్ చేశారు. పీట్ హెగ్‌సేత్ ఫాక్స్ న్యూస్ లో హోస్ట్ గా పనిచేశారు. సీఐఏ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ట్రంప్ ఎంచుకున్నారు. ఇజ్రాయెల్‌లో రాయబారిగా అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హుకాబీని ట్రంప్ ఎంచుకున్నారు