Tom Homan: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. టామ్ హోమన్‌కు ‘బార్డర్ జార్’గా బాధ్యతలు
గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) డైరెక్టర్ గా టామ్ హోమన్ పనిచేశారు.

Donald Trump and Tom Homan
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టామ్ హోమన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దేశ సరిహద్దుల భద్రత ‘బార్డర్ జార్’ గా ఆయన్ను నియమించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టామ్ ‘బార్డర్ జార్’గా బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ వెల్లడించారు.
Also Read: Donald Trump: ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) డైరెక్టర్ గా టామ్ హోమన్ పనిచేశారు. ట్రూత్ సోషల్ సైట్ లో ట్రంప్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘మాజీ ఐసీఈ డైరెక్టర్, దేశ సరిహద్దుల్లో భద్రతా వ్యవహరాలను పర్యవేక్షించడంలో సమర్ధత కలిగిన టామ్ హోమన్ కు బోర్డర్ జార్ గా బాధ్యతలు అప్పగించేందుకు నేను సంతోషిస్తున్నాను. దక్షిణ, ఉత్తర సరిహద్దులను పర్యవేక్షించడంతోపాటు, సముద్ర, విమానయాన భద్రతను పర్యవేక్షించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తాడని ట్రంప్ పేర్కొన్నారు. నాకు టామ్ చాలా కాలంగా తెలుసు. మా సరిహద్దు భద్రతా వ్యవహారాలను నిర్వహించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని పంపించే బాధ్యతలు కూడా టామ్ హోమన్ నిర్వహిస్తారని ట్రంప్ తెలిపారు.