Donald Trump: ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.. అరిజోనాలోనూ ట్రంప్‌దే విజయం.. ఏడు స్వింగ్ స్టేట్స్ స్వీప్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.

Donald Trump

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్ నకు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా ‘బ్లూ వాల్’ అని పిలవబడే రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగింది. సాంప్రదాయకంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలను ‘బ్లూ వాల్’ రాష్ట్రాలు అంటారు. ఇందులో 18 రాష్ట్రాలు ఉంటాయి. మరోవైపు ట్రంప్ స్వింగ్ రాష్ట్రాల్లోనూ సత్తా చాటాడు. అరిజోనా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సిన్ వంటి ఏడు స్వింగ్ రాష్ట్రాలూ ట్రంప్ వశమయ్యాయి.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి.. డెమొక్రాట్లు ఓడిపోవడానికి ఐదు కారణాలు ఇవే..

2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ గెలిచిన తరువాత రిపబ్లికన్ అభ్యర్ధి నెవడాను గెలుచుకోవడం ఇదే తొలిసారి. 2016లో అరిజోనాలో ట్రంప్ విజయం సాధించాడు.. ఆ తరువాత తాజాగా మరోసారి అరిజోనాను ట్రంప్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 2016లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ కు 304 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో అరిజోనాను జో బైడెన్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

 

ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నకు భారీ ఊరట లభించింది. 2020లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి ఆయనపై ఉన్న కేసుల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. ఈ కేసుల్లో పెండింగ్ డెడ్ లైన్స్ ను పక్కనబెట్టాలని స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్ కోరగా.. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. నిబంధనల ప్రకారం.. సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా రక్షణ ఉంటుంది.