ఏ నేరం చేసిందో : పక్షిని అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టిన పోలీసులు

  • Publish Date - October 2, 2019 / 02:27 PM IST

పక్షిని జైల్లో పెట్టడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇప్పుడు చూడండి. ఓ పక్షికి వింతైన అనుభవం ఎదురైంది. డచ్ పోలీసులు ఒక బుల్లి పక్షిని అరెస్ట్ చేశారు. వెంటనే తమ కస్టడీలోకి తీసుకున్నారు. అవును.. మీరు చదివింది నిజమే. అచ్చం చిలుక మాదిరిగా ఉన్న చిన్న పారాకీట్ పక్షిని పోలీసులు జైల్లో పెట్టారు.

ఈ వింతైన ఘటన నెదర్లాండ్స్ లో జరిగింది. ఇంతకీ ఆ పారాకీట్ పక్షి చేసిన నేరం ఏంటో తెలుసా? దొంగతనం.. షాపులోకి దూరి అందులోని వస్తువులను దొంగిలించడమే. పక్షి చేసిన నేరానికి దాన్ని పెంచుకున్న యజమాని కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఈ పారాకీట్ పక్షి.. రామచిలుక మాదిరిగా మాట్లాడగలదు. షాపులో వస్తువులను దొంగతనం చేసిన సమయంలో మనిషి భుజాలపై కూర్చొని ఉంది. ఈ నేరంలో యజమానికి కూడా భాగస్వామ్యం ఉందని, ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని భావిస్తూ పక్షితో పాటు అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పసుపు, ఆకుపచ్చ రంగుతో జైల్లో ఉన్న పక్షికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైల్లో ఉన్న పక్షికి పోలీసులు.. బ్రెడ్ తో పాటు నీళ్లు ఇవ్వడాన్ని కూడా ఇన్ స్టాగ్రామ్ ఫొటోలో చూడవచ్చు. ఈ పక్షి ఫోటోను చూసిన నెటిజన్లు పక్షి దొంగ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.