Pakistan Earthquake: పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, పాకిస్తాన్ లో భూకంపం రావడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. దీంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.26 గంటల సమయంలో భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
శనివారం కూడా పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.7గా, 4.0గా నమోదైంది. అది మరువక ముందే సోమవారం మరోసారి భూమి కంపించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
సోమవారం నాటి భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు వెలువడనప్పటికీ, వరుస భూ ప్రకంపనల పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారాంతంలో నమోదైన భూకంపాలు మరింత తీవ్రమైన భూమి కంపనానికి కారణమవుతాయని, వీటిని మరింత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు.