ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పుడు మరోసారి ఎబొలా వైరస్ పుట్టుకొచ్చింది. నార్త్ వెస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (DR) కాంగోలో ఎబొలా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఎబొలా వైరస్ మళ్లీ వచ్చిందనే విషయాన్ని అక్కడి కాంగో ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈక్వెటార్ ప్రావిన్సులోని వాంగటా, ఎంబడకాలో ఎబోలా వ్యాపించినట్టు కాంగో పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి 3లక్షల 73వేల 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వాంగటాలో కనీసం 6 ఎబొలా కేసులు నమోదు అయ్యాయి.
వీరిలో నలుగురు మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. నమోదైన ఆరు ఎబొలా కేసుల్లో మూడు కేసులు ల్యాబరేటరీ టెస్టులోనే ధృవీకరించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కాంగోలో ఎబొలా వ్యాప్తిచెందడం ఇది 11వసారి. కాంగోలో ఎబోలా మొట్టమొదటిసారి 1976లో వెలుగుచూసింది. ఎబొలా ఎంతటి ప్రాణాంతక వైరస్ తెలియాలంటే ఈ కింది విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.
ఎబొలా వైరస్ ఏంటి? మనుషుల్లో ఎలా వ్యాపిస్తుంది? :
ఎబొలా వైరస్ వ్యాధికి మరో పేరు ఉంది. ఎబొలా haemorrhagic fever. చాలా అరుదుగా వస్తుంది. కానీ, ఎబొలా వైరస్ జాతికి చెందిన గ్రూపు వైరస్ కారణంగా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తుంది. మొత్తం ఐదు వైరస్ జాతులు ఉండగా.. అందులో నాలుగు మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయి. ఒకసారి మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే.. వ్యాధినిరోధకత, లివర్ వంటి ప్రత్యేకమైన మానవ కణాలపై దాడి చేస్తాయి. వ్యాధి నిరోధకతను బలహీన పరుస్తుంది. తద్వారా శరీరంలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ప్రతి అవయం దెబ్బతింటుంది. WHO ప్రకారం.. ఎబొలా మరణాల రేటు సగటున 50 శాతం వరకు ఉంటుంది. గతంలో వైరస్ లతో పోలిస్తే 25శాతం నుంచి 90శాత మరణాల రేటులో వ్యత్యాసం ఉంది.
ఎబొలా వైరస్ మూలం ఎక్కడ? :
సీడీసీ ప్రకారం.. ఎబొలా వైరస్ పుట్టకకు అసలు మూలం ఎక్కడ, ఏంటి అనేది సైంటిస్టులకే అంతు పట్టలేదు. వానర జాతి లేదా జంతువులు, గబ్బిలాల ద్వారా వ్యాప్తి
చెంది ఉండొచ్చునని సైంటిస్టులు నమ్ముతున్నారు.
ఎబొలా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? :
ఈ వైరస్ ఒకరి శరీరాన్ని మరొకరు తాకడం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువుల్లో ఫ్రుట్ బ్యాట్ (గబ్బిలం) లేదా వానర జాతికి చెందిన ప్రైమేట్ నుంచి శరీరంలోని ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. మృతదేహాలను తాకడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఎబొలా వ్యాధి నుంచి కోలుకున్న పురుషుల్లోని శుక్రకణాలు (సీమెన్) నుంచి కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఆ వ్యక్తిలో వైరస్ లక్షణాలు దీర్ఘకాలికంగా కనిపించకపోయినప్పటికీ కూడా వారిలోని సీమెన్ ద్రవంలో వైరస్ అలానే ఉంటుంది. సెక్స్ ద్వారా ఎబొలా వైరస్ సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు.
ఎబొలా లక్షణాలు.. ఇవే:
ఎబొలా వ్యాధి సోకిన వ్యక్తిలో కనిపించే లక్షణాల్లో ఎక్కువగా సాధారణ వైరస్ లక్షణాలు మాదిరిగానే కనిపిస్తాయి.
* జ్వరం
* తలనొప్పి
* కండరాలు, కీళ్ల నొప్పులు
* పొత్తికడుపు నొప్పి
* గొంతులో నొప్పి
* బలహీనత
* ఆకలి మందగించడం
ఎబొలా వైరస్ సోకిన వారి శరీరంలో కళ్లు, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొంతమందిలో వాంతులు లేదా రక్తంతో కూడిన దగ్గు, చర్మంపై దద్దర్లు, రక్త విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎబొలా వ్యాధికి ఎలా చికిత్స చేస్తారు? :
ఎబొలా చికిత్సకు ప్రయోగ్మతక సీరమ్ ద్వారా వైరస్ ప్రభావిత కణాలను నాశనం చేయొచ్చు. ఆక్సీజన్, రక్తపోటు, ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ ఇన్ఫూజన్స్ ద్వారా ఎబొలా లక్షణాలను నివారించవచ్చు. వైరస్ సోకిన బాధితులు బతికే అవకాశం ఉంది. ప్రస్తుతం.. EVD లేదా ఎబొలాను నివారించే యాంటివైరల్ డ్రగ్ లేదు. ఇతర డ్రగ్స్ ద్వారా ఎబొలా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
ఎబొలాకు ఏదైనా వ్యాక్సిన్ ఉందా? :
ఎబొలా చికిత్స కోసం (rVSV-ZEBOV’ (tradename “Ervebo) అనే పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధికి US FDA డిసెంబర్ 19, 2019లో ఆమోదం తెలిపింది. సింగిల్ డోస్ ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ ను సమర్థవంతగా ఎదుర్కొంటుంది. ఎబొలా వైరస్ జాతికి చెందిన Zaire ebolavirus మాత్రమే ఈ వ్యాక్సిన్ ఎదుర్కొగలదు. ఎబొలాకు FDA ఆమోదం తెలిపిన తొలి వ్యాక్సిన్ కూడా ఇదే.