Bilawal Bhutto: నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ.. భారత్ పై నోరుపారేసుకున్న భిలావల్ భుట్టో.. వీడియో వైరల్

భారత్ నిర్ణయంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు.

Bilawal Bhutto

Bilawal Bhutto: జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలుసైతం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా.. భారత్ నిర్ణయంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు.

Also Read: Pakistan Army: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆర్మీ కాన్వాయ్ పై దాడి.. 10మంది సైనికులు హతం..

సింధు నది వెంబడి ఉన్న సుక్కూర్ లో భుట్టో మాట్లాడుతూ.. ‘‘పహల్గాం సంఘటనకు సంబంధించి భారతదేశం పాకిస్థాన్ పై ఆరోపణలు చేస్తుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత బలహీనతలను దాచిపెట్టి తన ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. సింధు నది పాకిస్థాన్ కు చెందినదని భారతదేశం అంగీకరించిన సింధు జలాల ఒప్పందాన్ని ఆయన ఏకపక్షంగా నిలిపివేయాలని నిర్ణయించారు. సింధు నది పక్కన ఉన్న సుక్కూర్ లో నిలబడి, సింధూ నది పాకిస్థాన్ దేనని, అది మనదేనని నేను భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను. ఈ సింధు నదిలో నీరు ప్రవహిస్తుంది.. లేదంటే రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ భిలావల్ భుట్టో జర్దారీ భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని.. ఆ నాగరికతకు నిజమైన సంరక్షులం తామేనంటూ భారత్ పై అక్కస్సు వెళ్లగక్కాడు.