ట్రంప్‌కి మస్క్ గుడ్ బై కొట్టడానికి కారణం ఇదే… ఏంటి ఈ “బిగ్ బ్యూటిఫుల్ బిల్”?

ఈ బిల్లుపై మస్క్‌ అసంతృప్తితో ఉన్నారు.

Donald Trump and Elon Musk

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెడుతున్న కీలక పాలసీల్లోని ఒకదానిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల విమర్శలు చేశారు. ఇప్పుడేమో ఏకంగా డోజ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇప్పుడు మాత్రం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ట్రంప్ “బిగ్, బ్యూటిఫుల్” అంటూ అభివర్ణిస్తున్న వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్ బిల్‌ యాక్ట్‌ (OBBBA)కు సంబంధించిన బిల్‌కు గత వారం అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదముద్ర పడింది. సెనేట్‌కి దాన్ని పంపారు. అమెరికాలో కొన్ని ట్రిలియన్ డాలర్ల పన్నుకోతలు, మిలటరీ వ్యయాన్ని పెంచడం వంటి అంశాలు ఆ బిల్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు ట్రంప్‌ ఇచ్చిన హామీల మేరకు ఈ బిల్‌ను తీసుకొచ్చారు.

Also Read: ఉన్న పార్టీని కాపాడుకోవాలి.. కొత్త పార్టీలు ఎందుకు? నేను అమెరికా వెళ్లి వచ్చేసరికి కుట్ర..: కవిత

అయితే, ఈ బిల్లుపై మస్క్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ కేటాయించాల్సి వస్తుంది. ట్రంప్‌ డోజ్‌ శాఖను ఏర్పాటు చేసిందే ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం కోసం. ఇప్పుడు డోజ్‌ ఆశయాలకు ఈ బిల్‌ అడ్డంకిగా మారుతుందని మస్క్ భావిస్తున్నారు.

అమెరికా గవర్నమెంట్ వ్యయాలను తగ్గించడానికి ఇప్పటివరకు డోజ్‌ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బిల్లుతో డోజ్‌ ప్రయత్నాలు వృథా అవుతాయని మస్క్ భావిస్తున్నారు. ఇదే సమయంలో డోజ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు మస్క్ ప్రకటించారు.

ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఆ దేశానికి ఇప్పటికే ఉన్న అప్పుల్లో వచ్చే ఆర్థిక ఏడాది మరో $600 బిలియన్ పెరుగుతుందని చెబుతున్నారు.